kcr: ఇంత పనికిమాలిన సచివాలయం ఏ రాష్ట్రంలోనూ లేదు: అసెంబ్లీలో సీఎం కేసీఆర్
- కొత్త సచివాలయం కడతాం.. వెనక్కి తగ్గం
- ప్రస్తుత తెలంగాణ సచివాలయ పరిస్థితి అధ్వానంగా ఉంది
- బైసన్ పోలో మైదానం క్రీడలకు కాదు
- అది మిలిటరీ వాళ్లది
కేసీఆర్ ప్రభుత్వం నిర్మించాలని భావిస్తోన్న సచివాలయంపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కొత్త సచివాలయ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ప్రస్తుత తెలంగాణ సచివాలయ పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పారు. ఇంత పనికిమాలిన సచివాలయం ఏ రాష్ట్రానికీ లేదని అన్నారు. హైదరాబాద్లో క్రీడా మైదానాలకు కొదవ లేదని,19 పెద్ద మైదానాలే కాకుండా ఇతర మైదానాలు కూడా ఉన్నాయని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో ఎవ్వరూ ఆడుకోవడానికి కూడా రావడం లేదని, దాన్ని ఫంక్షన్లకు వినియోగిస్తున్నారని చెప్పారు.
బైసన్ పోలో మైదానం క్రీడలకు కాదని, అది మిలిటరీ వాళ్లదని చెప్పారు. తాము కొత్త సచివాలయాన్ని తప్పకుండా నిర్మిస్తామని, వెనక్కి తగ్గబోమని కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం సచివాలయంలో సీఎం ఉండే సీ బ్లాక్ అధ్వానంగా ఉందని చెప్పారు. సీ బ్లాక్ మరింత దారుణంగా ఉందని తెలిపారు. కొత్తగా కట్టబోయే సచివాలయానికి రూ.180 కోట్లకు మించి ఖర్చు కాదని చెప్పారు. ప్రస్తుత సచివాలయంలో సీఎం కార్యాలయానికి వెళ్లాలంటే ఎన్నో వంపులో తిరుగుతూ వెళ్లాలని ఎద్దేవా చేశారు. ఇప్పుడున్న సచివాలయంలో ఫైల్స్ భద్రపరిచేందుకు స్థలం కూడా లేదని తెలిపారు.