national dish: జాతీయ వంటకంగా `కిచిడీ` అంటూ ప్రచారం..... స్పష్టతనిచ్చిన ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి!
- అదేం లేదన్న హర్‌సిమ్రత్ కౌర్ బాదల్
- రికార్డు కోసమే 800 కేజీల కిచిడీ తయారు చేస్తున్నట్లు వ్యాఖ్య
- నవంబర్ 3-5 వరకు న్యూ ఢిల్లీలో ఫుడ్ ఫెస్టివల్
నవంబర్ 4న 800 కేజీల కిచిడీని తయారుచేయనున్నట్లు తెలిసి సోషల్ మీడియాలో కిచిడీ అనే పదం ట్రెండింగ్‌గా మారింది. కిచిడీని జాతీయ వంటకంగా గుర్తించబోతున్నారంటూ పోస్టులు, ట్వీట్లు చేశారు. అయితే ఈ ట్వీట్లు చేసే వారికి స్పష్టతనిస్తూ కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి ఓ ట్వీట్ చేశారు. 800 కేజీల కిచిడీని తయారు చేసేది రికార్డు కోసమేనని, జాతీయ వంటకంగా గుర్తించే ప్రయత్నం కాదని ఆమె పేర్కొన్నారు. `కిచిడీని జాతీయ వంటకం అంటూ కిచిడీ చేసింది చాలు.. వరల్డ్ ఫుడ్ ఇండియాలో రికార్డు ఎంట్రీ కోసమే ప్రయత్నం` అని హర్‌సిమ్రత్ కౌర్ ట్వీట్ చేశారు.
నవంబర్ 3-5 వరకు న్యూ ఢిల్లీలో ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా 4వ తేదీన ప్రముఖ షెఫ్ సంజీవ్ కపూర్ 800 కేజీల కిచిడీ తయారు చేయనున్నారు. 1000 లీటర్ల సామర్థ్యం ఉన్న పాత్రలో ఈ వంటకం తయారుచేయనున్నారు. తర్వాత ఆ కిచిడీని 60వేల మంది అనాథ పిల్లలకు, ఫుడ్ ఫెస్టివల్‌కి హాజరైన విదేశీ ప్రతినిధులకు వడ్డించనున్నారు.