madhya pradesh: సివిల్స్ కోచింగ్ కు వెళ్లి వస్తున్న పోలీసు దంపతుల కుమార్తెపై సామూహిక అత్యాచారం
- మధ్యప్రదేశ్ లో మహిళలపై ఆగని దారుణాలు
- చదువుకుని ఇంటికి వెళుతుండగా కిడ్నాప్
- పట్టపగలు సామూహిక అత్యాచారం
- నిందితులను గుర్తించిన పోలీసులు
మధ్యప్రదేశ్ లో యువతులకు ఎంతమాత్రమూ రక్షణ లేకుండా పోతోందని నిరూపించిన మరో ఘటన ఇది. ఈ ఘటనలో బాధితురాలు స్వయంగా పోలీసు ఉన్నతాధికారుల బిడ్డ కావడం గమనార్హం. సివిల్స్ లక్ష్యంతో నిత్యమూ చదువుపైనే దృష్టి సారించి కష్టపడుతున్న యువతిపై కామాంధుల కన్ను పడింది. భోపాల్ పరిధిలోని హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఎంపీ నగర్ ప్రాంతంలో సివిల్స్ కు కోచింగ్ తీసుకుని బాధితురాలు ఇంటికి వస్తుండగా, నలుగురు యువకులు ఆమెను గమనించారు.
పట్టపగలు ఆమెను ఫాలో అయి, కిడ్నాప్ చేసి, మూడు గంటల పాటు నరకం చూపించారు. సామూహిక అత్యాచారం చేశారు. తనను ఏమీ చేయవద్దని యువతి వేడుకున్నా వినలేదు. ఈ నలుగురినీ స్థానికులైన గోలు, అమర్, గంటూ, రాజేష్ లుగా గుర్తించామని, వీరిపై 476 డీ, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. యువతి తల్లిదండ్రులు ఇద్దరూ పోలీసు అధికారులే కావడంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది.