lakka house: ఆనవాళ్లు దొరికాయి... పాండవులు తప్పించుకున్న లక్క ఇంటి కోసం అధికారిక అన్వేషణ!
- యూపీలో లక్క ఇల్లు ఉందనే అంచనా
- తవ్వకాలను చేపట్టనున్న పురావస్తు శాఖ
- డిసెంబర్ లో తవ్వకాలు ప్రారంభం
మహాభారతం గురించి కొంచెం తెలిసినవారికి కూడా లక్క ఇంటి గురించి అవగాహన ఉంటుంది. పాండవులను అగ్నికి ఆహుతి చేయాలనే కుట్రతో కౌరవులు లక్క ఇంటిని నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ లక్క ఇంటికి నిప్పు పెట్టడం, పాండవులు సొరంగమార్గం ద్వారా సురక్షితంగా బయటపడటం ఇదంతా భారతంలో ఆసక్తికరమైన ఘట్టం.
అయితే ఈ లక్క ఇల్లు ఎక్కడ ఉందనేది అందరిలో ఉన్న ప్రశ్న. దీన్ని కనిపెట్టడానికి ఏళ్ల తరబడి నిపుణులు, చరిత్రకారులు ప్రయత్నిస్తున్నారు. మనకు ఇప్పటి వరకు లభించిన అనేక అంశాల ఆధారంగా లక్క ఇంటిని కనుక్కునేందుకు భారత పురావస్తు శాఖ నడుంబిగించింది. ఉత్తరప్రదేశ్ బాగ్ పట్ లో ఉన్న బర్నావాలోనే లక్క ఇల్లు, సొరంగమార్గం ఉన్నట్టు భావిస్తున్న తరుణంలో, ఇక్కడ తవ్వకాలు చేపట్టడానికి ఆమోదించింది. ఈ ప్రాంతంలో లక్క ఇంటికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు గతంలో లభించాయి. డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే తవ్వకాలు మూడు నెలల పాటు కొనసాగుతాయి.
బర్నావా ప్రాంతం కౌరవులను పాండవులు అడిగిన ఐదు ఊర్లలో ఒకటని నమ్మకం. ఈ ప్రాంతానికి విశేషమైనటువంటి చారిత్రక ప్రాశస్త్యం ఉంది. మహాభారత సమయంలో వర్ణావ్రత్ గా పిలవబడ్డ ఈ ప్రాంతం క్రమేపీ బర్నావాగా మారింది. ఇక్కడికి సమీపంలోని చందాయాన్, సినౌలీ ప్రాంతాల్లో గతంలో చేపట్టిన తవ్వకాల్లో భారీ ఎత్తున ఆస్థిపంజరాలు, కుండలు, జాతిరత్నాలతో కూడిన కిరీటం వంటివి బయటపడ్డాయి.
ఈ ప్రాంతంలో ఉన్న మట్టిదిబ్బల లోపల సొరంగమార్గం కూడా బయటపడటంతో, లక్క ఇంటి నుంచి పాండవులు బయటపడ్డ సొరంగం ఇదేనని భావిస్తున్నారు. అయితే ఈ సొరంగం అనేక ఒంపులతో కూడి ఉంది. దీంతో, ఇంతవరకు దీని లోపలకు ఎవరూ వెళ్లలేదు. ఈ నేపథ్యంలో, బర్నావా ప్రాంతంలో తవ్వకాలను చేపడితే, అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.