mauritius: మారిషస్‌లో యూపీ సీఎం డెస్క్ మీద తిరగబడి ఉన్న జాతీయ జెండా
- ట్విట్టర్ పోస్టులో తప్పిదాన్ని గుర్తించిన నెటిజన్లు
- హేళన చేస్తూ కామెంట్లు
- ట్వీట్ డిలీట్ చేసిన యోగి ఆదిత్యానాథ్
అధికారిక పర్యటనలో భాగంగా మారిషస్ వెళ్లిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్కడ జరుగుతున్న వ్యవహారాలను పంచుకునేందుకు ట్విట్టర్లో ఫొటో పెట్టారు. డెస్క్ మీద కూర్చుని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, సీఎం ఇంకా అధికారుల సమక్షంలో ఏదో ఫైల్ మీద సంతకం పెడుతున్న ఫొటోను ఆయన షేర్ చేశారు. అయితే ఆ ఫొటోలో ఉన్న తప్పిదాన్ని నెటిజన్లు వెంటనే గుర్తించారు.
మారిషస్‌లో డెస్క్ మీద ఉన్న భారత జాతీయ పతాకం తిరగబడి ఉండటాన్ని వారు గమనించారు. దీంతో హేళన చేస్తూ తమకు నచ్చిన విధంగా కామెంట్లు చేశారు. 'ప్రపంచం తలకిందులైనా పర్లేదు, దేశపతాకం ఎలా తలకిందులు కానిచ్చావ్?', 'కాషాయం రంగు నీకు ఇష్టమేగా!... అది కిందకి ఉన్న సంగతి గుర్తించలేదా?' అంటూ హేళన చేశారు. ఫొటోను పోస్ట్ చేసిన 16 గంటల తర్వాత సీఎం ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. అప్పటికే ఫొటో వైరల్‌గా మారిపోయింది.