Andhra Pradesh: అమరావతిలో నక్షత్ర హోటళ్ల నిర్మాణానికి క్యూ.. ముందుకొచ్చిన 14 ప్రముఖ సంస్థలు
- హోటళ్ల నిర్మాణం కోసం నిబంధనలు సరళతరం చేస్తున్న ఏపీ సర్కారు
- నిర్మాణానికి ముందుకొచ్చిన జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు
- 2020 నాటికి రాజధానిలో 1200 గదులను అందుబాటులోకి తీసుకొచ్చే యోచన
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో స్టార్ హోటళ్ల నిర్మాణానికి ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. స్టార్ హోటళ్ల నిర్మాణంతో 2020 నాటికి అమరావతిలో 1200 అధునాతన హోటల్ గదులను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. హోటళ్ల నిర్మాణం కోసం ఆయా సంస్థలు కోరిన సడలింపులకు ప్రభుత్వం కనుక అంగీకరిస్తే అమరావతికి మరిన్ని బ్రాండ్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకోసం భూమి ధరల్లో సరళత, మార్పులను ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సీఆర్‌డీఏ ప్రతిపాదనలు సమర్పించింది.
సరళమైన నిబంధనలతో ప్రభుత్వం ఆహ్వానించిన బిడ్లకు అనూహ్య స్పందన లభించింది. ప్రముఖ దేశీయ బ్రాండ్లతోపాటు అంతర్జాతీయ బ్రాండ్లు కూడా ముందుకొచ్చాయి. మొత్తం 14 సంస్థలు అమరావతిలో స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపించాయి. ఇంటర్ కాంటినెంటల్, హిల్టన్, మారియట్, మారిగోల్డ్, గ్రీన్‌పార్క్, ఫార్చ్యూన్, తాజ్, పార్క్, జీఆర్‌టీ, బెస్ట్ వెస్టర్న్, దస్‌పల్లా, లీలా, ఒబెరాయ్ అండ్ మారియట్, ఎస్‌జీపీ వంటి బ్రాండ్లు ఉన్నాయి. నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థల్లో తొలి 11 బ్రాండ్లకు డెవలపర్లు కూడా ఖరారయ్యారు. మిగిలి మూడు సంస్థలు డెవలపర్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి.