america: డొనాల్డ్ ట్రంప్ కు మధ్యవేలు చూపించిన యువతి... ఆమె ఉద్యోగాన్ని దూరం చేసిన ఫొటో ఇది!
- ట్రంప్ కాన్వాయ్ చూడగానే మహిళ ఆగ్రహం
- సైకిల్ పై వెళుతూ అసభ్య సంజ్ఞ
- ఉద్యోగం నుంచి తొలగించిన సంస్థ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కాన్వాయ్ లో వెళుతున్న వేళ, అదే దారిలో సైకిల్ పై వెళుతున్న ఓ మహిళ, ట్రంప్ వైఖరిని నిరసిస్తూ, తన మధ్యవేలును గాల్లోకి ఎత్తి (అమెరికన్లు దీనిని బూతుగా వాడతారు) చూపిస్తూ వెళ్లింది. ఈ ఘటనను న్యూస్ ఏజన్సీ 'ఏఎఫ్పీ' వైట్ హౌస్ ఫొటోగ్రాఫర్ బ్రెండన్ స్మియాలోవ్ స్కీ తన కెమెరాలో బంధించాడు. ఆ చిత్రం వెంటనే వైరల్ అయింది.
వాషింగ్టన్ లోని గోల్ఫ్ క్లబ్ రహదారిపై ఈ ఘటన జరుగగా, పనులన్నీ వదిలివేసి, ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా గోల్ఫ్ ఆడేందుకు ట్రంప్ వెళుతున్నాడన్న ఆగ్రహంతో, డెమొక్రాట్ల మద్దతుదారైన ఆ మహిళ ఎడమచేతిని పైకెత్తి మధ్యవేలు చూపించింది. అదే సమయంలో ట్రంప్ కాన్వాయ్ లో వెళుతున్న బ్రెండన్, ఆ చిత్రాన్ని బంధించాడు.
"నా పక్క నుంచి అతను వెళుతున్నాడు. నా రక్తం మరగడం ప్రారంభమైంది" అని ఆ 50 ఏళ్ల మహిళ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఆమె చూపిన సంజ్ఞను ట్రంప్ చూశాడో, చూడలేదో తెలియలేదుగానీ, ఆమె పనిచేస్తున్న సంస్థ మాత్రం ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. యూఎస్ సోషల్ మీడియా పేజీల్లో ఈ ఫొటోయే ఇప్పుడు టాప్ ట్రెండింగ్. ఆ చిత్రాన్ని మీరూ చూడవచ్చు.