Donald Trump: దక్షిణ కొరియాలో ట్రంప్ విందు భోజనం ఇదే... 360 ఏళ్ల నాటి సోయా సాస్‌తో విందు!
- ట్రంప్‌కి ఇష్టమైన సోలే చేప
- వివాదాస్పద దీవి నుంచి తెచ్చిన రొయ్యలు
- వెల్లడించిన సియోల్ అధ్యక్ష భవనం
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ద బ్లూ హౌస్ బాంకెట్ హాల్లో ట్రంప్ ఇవాళ విందు భోజనం ఆరగించనున్నారు. అందుకోసం ప్రత్యేక వంటకాలను సిద్ధం చేయించినట్లు ఆ దేశ అధ్యక్ష భవనం ప్రకటించింది. ట్రంప్ కోసం 360 ఏళ్ల నాటి సోయా సాస్‌ను విందులో వడ్డించనున్నట్లు పేర్కొంది. అంటే ఈ సాస్ 1657 సమయంలో తయారు చేసిందన్నమాట.
దక్షిణ కొరియన్లకు ఆహారంలో సోయా సాస్ చాలా ప్రత్యేకం. ఇది ఎంత ఎక్కువ కాలం పులిస్తే అంత రుచిగా ఉంటుంది. అందుకే దాని తయారీ కాలాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. గతంలో ఓ వంటల ఫెస్టివల్లో 450 ఏళ్ల క్రితం నాటి సోయా సాస్ 100 మిలియన్ వాన్లకు (90వేల డాలర్లు) అమ్ముడుపోయిందంటే దాని విలువ అర్థం చేసుకోవచ్చు.
ఈ సాస్‌తో పాటు ట్రంప్‌కి ఇష్టమైన సోలె చేప, అలాగే దక్షిణ కొరియా, జపాన్ మధ్య వివాదాస్పదంగా ఉన్న డోక్డో దీవి నుంచి తీసుకువచ్చిన రొయ్యలను వడ్డించనున్నారు. దక్షిణ కొరియా సంప్రదాయ ఆహారాలను ప్రతిబింబించేలా రుచికర ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లు అధ్యక్ష భవనం ప్రతినిధులు తెలిపారు.