Jagan: ఏడాదిన్నర ఆగండి.. లక్షా నలభై రెండు వేల ఉద్యోగాలు నేను ఇస్తా!: వేంపల్లిలో జగన్
- ప్రస్తుతం కడప జిల్లా వేంపల్లిలో జగన్
- లక్షా నలభై రెండు వేల ఉద్యోగాలు ఇస్తానని చంద్రబాబు ఎన్నికలప్పుడు అన్నారు
- మన ప్రభుత్వం రాగానే మీ కలలు నెరవేరుతాయి
- అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తా
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల కష్టాలను తెలుసుకునే ఉద్దేశంతో పాదయాత్ర మొదలుపెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా వేంపల్లిలో ఉన్నారు. అక్కడి శ్రీనివాస కల్యాణ మండపంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. 'జాబు రావాలంటే బాబు రావాలి' అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ జాబు మాటే మర్చిపోయారని చెప్పారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ పెడతానని చెప్పిన చంద్రబాబు, రాష్ట్రంలో లక్షా నలభై రెండు వేల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికలప్పుడు అన్నారని, అయితే ఏమీ చేయలేదని అన్నారు.
ఏపీ యువత ఒక ఏడాదిన్నర ఆగాలని, తాను అధికారంలోకి వచ్చాక లక్షా నలభై రెండు వేల ఉద్యోగాలు తాను ఇస్తానని వ్యాఖ్యానించారు. అలాగే తమ ప్రభుత్వం వచ్చాక పింఛన్‌ను రెండు వేల రూపాయలు చేస్తానని అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానని చెప్పారు.