Team india: నిన్నటి మ్యాచ్ లో హైలైట్ ఆ రెండు క్యాచ్ లు!
- సిరీస్ కే హైలైట్ ఆ రెండు క్యాచ్ లు
- లాంగాన్ మీదుగా పరుగెత్తి బంతిని పట్టి, గాల్లోనే గ్రాండ్ హోంకు విసిరిన శాంటనర్
- వెనక్కి పరుగెత్తుతూ బంతిని ఒడిసిపెట్టేసిన రోహిత్ శర్మ
కేరళ రాజధాని తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ మైదానం వేదికగా జరిగిన పేటీఎం టీ20 టైటిల్ పోరులో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే చివరిదైన మూడో టీ20లో రెండు అద్భుతమైన క్యాచ్ లు అభిమానులతో పాటు క్రీడా ప్రేమికులందర్నీ అలరించాయి. మనీష్ పాండ్ అవుటైన సందర్భంగా శాంటనర్, గ్రాండ్ హోం అందుకున్న క్యాచ్ సిరీస్ కై హైలైట్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ తరువాత కివీస్ బ్యాటింగ్ సందర్భంగా రోహిత్ శర్మ పట్టిన క్యాచ్ ను గొప్ప క్యాచ్ గా చెప్పుకోవచ్చు!
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్లలో ధావన్ అవుట్ కావడంతో కోహ్లీ.. రోహిత్ అవుట్ కావడంతో శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చారు. కోహ్లీ అవుటవడంతో మనీష్ పాండే క్రీజులోకివచ్చాడు. వస్తూనే భారీ షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో బోల్ట్ బౌలింగ్ లో భారీ షాట్ ను ఆడాడు. అది బౌండరీ లైన్ లో పడుతోంది. ఇంతలో లాంగాన్ నుంచి మిడ్ ఫీల్డ్ దిశగా పరుగెత్తుకుంటూ వచ్చిన శాంటనర్ బంతిని గాల్లోనే అందుకున్నాడు. దీంతో ఎదురుగా పరుగెత్తుకుంటూ వస్తున్న గ్రాండ్ హోమ్ కు దానిని అలాగే క్యాచ్ పట్టమంటూ విసిరాడు. దీంతో బంతిని గ్రాండ్ హోం అందుకున్నాడు. ఈ క్యాచ్ కు అభిమానులంతా ఫిదా అయిపోయారు.
ఆ తరువాత న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా హార్డ్ హిట్టర్ కొలిన్ మున్రో కొట్టిన షాట్ గాల్లోకి లేచింది. అదెంత విలువైన వికెట్టో తెలిసిన రోహిత్ శర్మ బంతి వెనక్కి దూసుకెళ్తుండడంతో వేగంగా స్పందించాడు. వేగంగా వెనక్కి పరుగెడుతూనే బంతిని ఒడిసిపట్టేశాడు. వెనక్కి పరుగెత్తి బంతిని పట్టుకోవడం చాలా కష్టం కావడంతో, బంతిని జారనీయకుండా రోహిత్ పట్టుకోవడం ప్రేక్షకులను అలరింపజేసింది. ఈ రెండు క్యాచ్ లు సిరీస్ కే హైలైట్ అని విశ్లేషకులు పేర్కొన్నారు.