PUNJAB: పంజాబ్ లో వరుస హత్యల వెనుక ఐఎస్ఐ హస్తం: అమరీందర్ సింగ్ ఆరోపణలు
- హత్యలకు తెగబడుతున్న ఐఎస్ఐ
- యువతను ఉగ్రవాదులుగా మార్చాలని యత్నం
- తద్వారా దేశంలో అశాంతి రేపడమే లక్ష్యం
- పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) రాష్ట్రంలో హత్యాకాండలకు తెగబడుతోందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆరోపించారు. రాష్ట్రంలో వామపక్ష నేతలు, కార్యకర్తల హత్యల వెనుక ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో మత కల్లోలాలను సృష్టించాలని వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఐఎస్ఐ ప్రమేయంపై సాక్ష్యాలను పంజాబ్ పోలీసులు ఇప్పటికే సేకరించారని తెలిపారు.
రాష్ట్రంలోని యువతను ఉద్యమాలవైపు, ఉగ్రవాదం వైపు మళ్లించి, దేశంలో అశాంతిని రేపాలన్నదే వారి ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. కాగా, నభా జైలు నుంచి పారిపోయిన గ్యాంగ్ స్టర్ ను అరెస్ట్ చేసే క్రమంలో, నలుగురు ఉగ్రవాదులు కూడా పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. జనవరి 2016 నుంచి పంజాబ్ లో హత్యలు పెరిగిపోయాయి. ఈ హత్యలతో పాక్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులకు సంబంధాలు ఉన్నాయని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇక తాజా అరెస్టులతో ఐఎస్ఐ ప్రమేయంపై మరిన్ని ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది.