delhi: ప్రాణాంతక గ్యాస్ చాంబర్ లా న్యూఢిల్లీ... విద్యార్థులకు నిరవధిక సెలవులు!
- చెత్తను తగులబెడుతున్న పంజాబ్, హర్యానా
- ఢిల్లీని ఆవరించిన కాలుష్య మేఘం
- బయటకు వస్తే కళ్లు, గొంతు మంటలు
ఇరుగు, పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ చెత్తను తగులబెడుతూ ఉండటంతో ఏర్పడిన వాయు కాలుష్యం ఢిల్లీ నగరాన్ని ముంచెత్తగా, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఆస్తమా తదితర శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఇప్పుడున్న గాలిని పీలిస్తే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరించారు.
ప్రస్తుతం ఢిల్లీ నగరం ఓ గ్యాస్ చాంబర్ లా ఉందని అభివర్ణించిన సీఎం కేజ్రీవాల్, చిన్నారులు బయటకు రావడం క్షేమకరం కాదని అన్నారు. కాగా, తప్పనిసరి పనుల మీద బయటకు వచ్చిన ఎంతో మంది తమ కళ్లు నొప్పిగా ఉన్నాయని, గొంతులో మంట పుడుతోందని ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. గాలిలో కాలుష్యం 100 రీడింగ్ ను దాటితేనే సెంట్రల్ పొల్యూషన్ బోర్డు ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఈ రీడింగ్ గరిష్ఠంగా 500 వరకూ ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్య స్థాయి 451కి చేరిందంటే, పరిస్థితి ఎంత ప్రమాదకరమో ఊహించవచ్చు.