anil bokil: నగదు రహితం అసాధ్యం... పన్నురహితం చేయండి: మోదీకి నోట్ల రద్దు సలహా ఇచ్చిన అనిల్ బోకిల్ కీలక వ్యాఖ్య
- నోట్లను రద్దు చేయమని ప్రధానికి సూచించిన అనిల్ బొకిల్
- నగదు రహిత భారతావని ఇప్పట్లో అసాధ్యం
- పేదల తలసరి ఆదాయం రూ. 50 మాత్రమే
- 30 శాతం మందికి రూ. 100తో గడుస్తున్న పూట
- పెద్ద నోట్లతో లంచగొండులు, సమాజ వ్యతిరేకులకే ఉపయోగం
అనిల్ బొకిల్... ఈ పేరు గుర్తుందా? ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తరువాత, ఆయన్ను స్వయంగా కలిసి డీమానిటైజేషన్ ఆలోచనను ఆయనకు చెప్పిన వ్యక్తి. అనిల్ సలహా మేరకే తాను నోట్ల రద్దును గురించి సీరియస్ గా ఆలోచించానని మోదీ సైతం స్వయంగా వెల్లడించారు.
ఇక ఆపై జరిగిన నోట్ల రద్దుతో 86 శాతం కరెన్సీని చలామణి నుంచి వెనక్కు తీసుకోగా, ఆ తర్వాత భారతీయులు చిల్లర కష్టాలు, నగదు కష్టాలు తెలిసిందే. ఇక నోట్ల రద్దు జరిగి ఓ సంవత్సరం గడిచిపోయిన సందర్భంగా ఈ ఆలోచన చేసిన అనిల్ బొకిల్ తో ఓ వార్తా సంస్థ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో అనిల్ పలు కీలకాంశాలను, తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఇండియాను నగదు రహితంగా చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని, అదే సమయంలో పన్ను రహితంగా మార్చేందుకు ప్రయత్నించి విజయం సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో పేదల తలసరి ఆదాయం రోజుకు రూ. 50గా లెక్కిస్తే, 30 శాతం మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్టేనని అన్నారు.
వారందరికీ రూ. 100 నోటు ఉంటే సరిపోతుందని, ఇదే సమయంలో 86 శాతం చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు రూ. 500, రూ. 1000 రద్దుతో వారిపై పెద్దగా ప్రభావం చూపలేదని, ఈ నోట్ల రద్దు లంచగొండిదారులు, సమాజ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రభావం చూపిందని అన్నారు. రూ. 2 వేల నోటు రాకతో నల్లధనం, అవినీతి అంతమవుతాయన్న అంచనాలు పోయాయని అన్నారు. నోట్లను రద్దు చేసిన తరువాత ప్రారంభంలో ప్రజలు కొన్ని ఇబ్బందులు పడ్డారని, ఆ తరువాత అవి నెమ్మదిగా తగ్గాయని అన్నారు.