komatireddy venkatareddy: ఎమ్మెల్యేగా గెలవలేకపోతే తెలంగాణలో తిరగలేను: కోమటిరెడ్డి
- అసెంబ్లీకే పోటీపడతాను
- పార్లమెంట్ కు వెళ్లే ఉద్దేశం లేదు
- భూపాల్ కు అంత సీన్ లేదు
- నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి
మరో ఏడాదిన్నరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా తాను గెలవలేకపోతే, తెలంగాణ రాష్ట్రంలో తిరగలేనని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, లాబీల్లో తనను కలిసిన మీడియాతో ముచ్చటించారు. వచ్చే ఎన్నికల్లోనూ తాను ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తానని, ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్లే ఉద్దేశం లేదని చెప్పిన ఆయన, తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కంచర్ల భూపాల్ రెడ్డికి తనను ఓడించేంత సీన్ లేదని అన్నారు.
విద్యార్థులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ పై పోరాటం కొనసాగిస్తామని, త్వరలోనే నాంపల్లిలోని ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ తదితర కలుషితాల వల్ల అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న అనాధ బాలబాలికలను హైదరాబాద్ కు తరలించి చికిత్స జరిపించి ఆదుకోవాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.