Aadhar: ఇక బీమాకు ఆధార్ తప్పనిసరి.. తక్షణం అమల్లోకి!
- బీమా పాలసీలకు ఆధార్‌ను తప్పనిసరి చేసిన ఐఆర్‌డీఏ
- పాత, కొత్త వినియోగదారులు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సిందే
- నాన్-లైఫ్ బీమాదారులకు ఇబ్బందే అంటున్న బీమా విశ్లేషకులు
ఆధార్ అనుసంధానం ఇక బీమా పథకాలకూ తప్పనిసరి. ఇప్పటికే పలు ప్రభుత్వ పథకాల నుంచి సిమ్ కార్డుల వరకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌లకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసినట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) స్పష్టం చేసింది. ఇప్పటికే బీమా పాలసీలు కలిగిన వారు తక్షణం తమ ఆధార్, పాన్ కార్డులను అనుసంధానం చేసుకోవాలని కోరింది. కొత్తగా బీమా తీసుకునేవారు తప్పనిసరిగా వీటిని సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆధార్ చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కాగా, మరోవైపు ఐఆర్‌డీఏ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
మనీ లాండరింగ్ చట్టాన్ని సవరించిన కేంద్రం బ్యాంకు, మ్యూచువల్ ఫండ్స్ సహా అన్ని ఆర్థిక లావాదేవీలకు ఆధార్, పాన్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఐఆర్‌డీఏ ప్రకటన వెలువడింది. కాగా, రెగ్యులేటరీ నిర్ణయం నాన్-లైవ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి కొంత ఇబ్బందికరంగా మారవచ్చని ఇన్సూరెన్స్ అనలిస్ట్ నిధేష్ జైన్ పేర్కొన్నారు. జీవిత భీమా తీసుకున్న వారిలో ఇప్పటికే చాలామంది ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం మొదలుపెట్టినట్టు తెలిపారు.