air india: ఇండిగోపై సెటైర్ వేసి.. ఆపై వెనక్కు తగ్గిన ఎయిర్ ఇండియా!
- నమస్కరించడానికే చేతులు ఎత్తుతాం
- ఇండిగో పేరు చెప్పకుండా ఎద్దేవా చేసిన ఎయిర్ ఇండియా
- ఏఐలో ఘటనలను ఎత్తి చూపిన నెటిజన్లు
- పెట్టిన ట్వీట్లను తొలగించిన ఎయిర్ ఇండియా
ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ప్రజలు, డీజీసీఏ ఆగ్రహంగా ఉన్న వేళ, ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా, తొలుత విరుచుకుపడి, ఆపై వెనక్కు తగ్గింది. తన ట్విట్టర్ ఖాతాలో రెండు ప్రకటనలను ఉంచిన ఎయిర్ ఇండియా, తొలి ప్రకటనలో "ఉయ్ రైజ్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ టూ సే నమస్తే" (మేము మా చేతులను నమస్కరించడానికి మాత్రమే ఎత్తుతాము) అని చెప్పింది. ఇండిగోలో ఓ ప్రయాణికుడిపై గ్రౌండ్ స్టాఫ్ దాడికి దిగిన విషయాన్ని ప్రస్తావించకుండానే, దాన్ని ఇలా ఎత్తిచూపింది.
ఆపై మరో యాడ్ లో, 'అన్ బీటబుల్ సర్వీస్' అని ఆంగ్లంలో ఇస్తూ, 'బీట్' అన్న పదాన్ని హైలైట్ చేసింది. ఈ రెండు ట్వీట్లూ క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే నెటిజన్లు గతంలో ఎయిర్ ఇండియాలో జరిగిన కొన్ని ఘటనలను ప్రస్తావిస్తూ, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ప్రారంభించేసరికి ఎయిర్ ఇండియా సదరు ట్వీట్లను తొలగించింది. కానీ అప్పటికే వాటి స్క్రీన్ షాట్స్ వైరల్ అయి, మరిన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా చక్కర్లు కొడుతున్నాయి.