KCR: సమైక్య పాలకులు అప్పట్లో చాలా దర్మార్గమైన ప్రచారం చేశారు: అసెంబ్లీలో కేసీఆర్
- తెలంగాణకు చరిత్రే లేదని హేళన చేశారు
- ఉంటే అది రజాకార్ల చరిత్రేనని అన్నారు
- తెలంగాణ చరిత్రను వక్రీకరించారు
- నిజాం రాజు సమాధి దగ్గరకు వెళితే, ఎందుకు వెళ్లారని అడిగారు
సమైక్య పాలకులు అప్పట్లో తెలంగాణపై చాలా దర్మార్గమైన ప్రచారం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు అసెంబ్లీలో మైనార్టీల అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తనను కొందరు ఇప్పటికీ నయా నైజాం రాజు అంటూ విమర్శలు చేస్తున్నారని అన్నారు.
అప్పట్లో పాలకులు తెలంగాణ అంటేనే చరిత్ర లేనిదని, రజాకార్ల చరిత్ర మాత్రమే ఉందని ప్రచారం చేశారని అన్నారు. తెలంగాణ చరిత్రను వక్రీకరించారని చెప్పారు. తెలంగాణకు చరిత్రలో చెప్పుకోవడానికి ఏమీ లేదని అన్నారని అన్నారు. అటువంటి వక్రీకరణలను పోగొట్టే బాధ్యత తనపై ఉందని అన్నారు.
తాను గతంలో నిజాం రాజు సమాధి దగ్గరకు వెళితే, ఎందుకు వెళ్లారని అడిగారని కేసీఆర్ గుర్తు చేశారు. నిజాం అప్పట్లో మన తెలంగాణ రాజు అని కేసీఆర్ తెలిపారు. ఆంధ్రలో కాటందొర ఉత్సవాలు ఎందుకు చేస్తారని తాను అప్పట్లో ప్రశ్నించానని చెప్పారు. 200 ఏళ్లు దేశాన్ని పాలించిన తెల్లదొరలను ఎలా కీర్తిస్తారని నిలదీశారు.
కాగా, నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన ప్రతిపాదనలను అమలు చేస్తామని కేసీఆర్ తెలిపారు. ముస్లిం అభ్యర్థుల వినతి ప్రకారం అన్ని ఉద్యోగ నియామక పరీక్షలను ఉర్దూలో రాసుకునే అవకాశం కల్పిస్తామని అన్నారు. ఉద్యమాలు తమకేం కొత్త కాదని చెప్పారు.
తమిళనాడులో ముస్లింలకు రిజర్వేషన్ అమలులో ఉందని చెప్పారు. తెలంగాణ కూడా దక్షిణ భారతదేశంలోనే ఉందని, రాజ్యాంగం అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉంటుందని అన్నారు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ముస్లింల రిజర్వేషన్లు సాధిస్తామని అన్నారు. దళిత క్రైస్తవుల గురించి కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు.