madhyapradesh: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గ్యాంగ్ రేప్ కేసులో వైద్య సిబ్బంది ఘోరతప్పిదం!
- భోపాల్ లోని హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ సమీపంలో కోచింగ్ కు వెళ్లి వస్తున్న యువతి గ్యాంగ్ రేప్
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులపై సస్పెన్షన్ వేటు
- ఆమె ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొందంటూ మెడికల్ రిపోర్ట్
- తప్పుదొర్లింది.. సరిచేశామన్న సిబ్బంది
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మధ్యప్రదేశ్ లోని భోపాల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన యువతి సామూహిక అత్యాచార కేసులో మరో ఘోర తప్పిదం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులను బాధితురాలే తండ్రితో కలిసి పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను పట్టుకుని చేసిన విచారణలో సామూహిక అత్యాచారం నిజమేనని నిర్ధారించారు. అనంతరం యువతిని వైద్యపరీక్షల కోసం సుల్తానియా మహిళా ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ రిపోర్టులో సిబ్బంది 'బాధిత యువతి ఇష్టపూర్వకంగానే నిందితులతో శృంగారంలో పాల్గొంది' అంటూ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ క్రమంలో మీడియాలో పలు కథనాలు ప్రసారం అయ్యాయి. సాక్షాత్తూ నిందితులే గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డట్టు అంగీకరించడానికి తోడు, గతంలో వారికి నేరచరిత్ర ఉండడాన్ని ప్రస్తావిస్తూ కథనాలు ప్రసారం చేశారు.
దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన సుల్తానియా మహిళా ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ కరణ్ పీప్రె స్పందిస్తూ, ‘‘ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన సిబ్బంది కొత్త వాళ్లు కావటంతో ఈ తప్పు దొర్లింది. తప్పును సరి చేసి కొత్త నివేదికను విడుదల చేశాం’’ అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చారు. అంతే కాకుండా సున్నితమైన కేసుల్లో సీనియర్ మహిళా వైద్యురాలి పర్యవేక్షణ తప్పనిసరి చేశామని కూడా తెలిపారు.