Andhra Pradesh: నవ్యాంధ్రలో రూ.10 వేల కోట్ల దక్షిణ కొరియా పెట్టుబడులు.. ఏపీ సూపర్ అన్న పారిశ్రామికవేత్తల బృందం
- బూసాన్ తరహాలో ఏపీలో అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్
- ఏపీ తమకు బాగా నచ్చిందన్న పారిశ్రామికవేత్తల బృందం
- అన్ని రకాలుగా సహకరిస్తామన్న చంద్రబాబు
నవ్యాంధ్రలో 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా కంపెనీలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి చెందిన చెందిన 30 మంది పారిశ్రామికవేత్తల బృందం గురువారం ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. ఈ సందర్భంగా పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తమ దేశంలోని బూసాన్లో ఒకేచోట మూడు వేల పరిశ్రమలతో కూడిన ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందని, ఏపీలోనూ అటువంటిదే ఏర్పాటు చేయాలన్నదే తమ ఉద్దేశమని భారత్లోని కొరియా కాన్సుల్ జనరల్ జియాంగ్ డియోక్ మిన్ సీఎంకు తెలిపారు.
తమ బృందం దేశంలోని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లోనూ పర్యటించిందని, అయితే పరిశ్రమల ఏర్పాటుకు ఏపీనే అత్యంత అనుకూలమైన ప్రాంతంగా భావిస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు స్పందిస్తూ బూసాన్ తరహా పారిశ్రామిక వాడ నిర్మాణానికి తాము అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. కొరియా పరిశ్రమలతో రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.