NTR: లక్ష్మీపార్వతి గారూ... అని పిలిచి లేపిన ఎన్టీఆర్ ఆత్మ చెబుతున్నదిదే... రాంగోపాల్ వర్మ తయారు చేసిన షార్ట్ ఫిల్మ్ చూడండి!
- నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిని విమర్శిస్తూ వర్మ షార్ట్ ఫిల్మ్
- సోషల్ మీడియాలో వైరల్
- కేతిరెడ్డికి సహకరించాలని లక్ష్మీపార్వతికి క్లాస్
- ఆయనో బృహత్తర కార్యం తలపెట్టారని వ్యంగ్య వ్యాఖ్యలు
నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిని విమర్శిస్తూ రాంగోపాల్ వర్మ తయారు చేసిన వ్యంగ్య షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్ష్మీ పార్వతి నిద్రిస్తుండగా వచ్చిన ఎన్టీఆర్ ఆత్మ తొలుత ఆమెకు క్లాస్ పీకి, ఆపై కేతిరెడ్డి కలలోకి వచ్చి వెన్నంటి ఉన్నానని చెప్పడం ఇందులో స్పెషల్.
"లక్ష్మీ పార్వతిగారూ..." అంటూ ఆమెను నిద్రలేపే ఎన్టీఆర్ ఆత్మ, "ఏం... ఏమది? మా మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లుతుంటే, మీరు ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతున్నారు? లేవండి... లేచి మా మాటలు శ్రద్ధగా ఆలకించండి. ఆచరించండి. మాకు అభిమానపాత్రుడు చిరంజీవి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి గారు, మా మీదగల అపారమైన గౌరవంతో, అభిమానంతో, ప్రేమతో మామీద చలనచిత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు.
అందరికీ తెలుసు... మా జీవితం తెరచిన పుస్తకమని. కానీ, అందులో కొన్ని తెరవని పుటలని, తెలియని సంఘటనలని, తెరవాలని, ప్రజల ముందు పరవాలన్న సత్సంకల్పంతో ఇంతటి బృహత్తర కార్యాన్ని తలపెట్టారు. ఇంతవరకూ బొమ్మ మాత్రమే తెలిసిన మా జీవితంలో మరో కోణంలోని బొరుసును ఆవిష్కరించే వారి ప్రయత్నాన్ని మీరు అడ్డుకోవాలని ప్రయత్నించడం అవివేకం. మాకు ఏమాత్రం ఆమోదయోగ్యమూ కాదు. కనుక, మా ఆదేశం శిరసావహించి, ఈ దేశానికి మా జీవితంలోని అన్ని కోణాలూ తెలిసేలా వారికి సహకరించండి. ఇది సర్వజనసమ్మతం, ఇదే మా ఆదేశం" అని చెప్పి అంతర్థానమవుతుంది. ఆపై అదే ఆత్మ కేతిరెడ్డినీ తట్టి లేపి తన మనసులోని మాట వినిపిస్తుంది.