akula lalitha: మోసగాడి మాటలకు బోల్తాపడి పది లక్షలు సమర్పించుకున్న ఎమ్మెల్సీ ఆకుల లలిత
- సెక్రటేరియేట్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పుకున్న బాలాజీ నాయుడు
- రూ. 2 కోట్ల నిధులు వచ్చాయని నమ్మించిన వైనం
- వాటి కోసం రూ. 10 లక్షలు కమిషన్ సమర్పించుకున్న ఎమ్మెల్సీ
- నిజం తెలిసిన తరువాత తనలా ఎవరూ మోసపోవద్దని సూచన
ఓ వ్యక్తి, తాను సెక్రటేరియేట్ నుంచి ఫోన్ చేస్తున్నానని, కేంద్రం నుంచి రూ. 2 కోట్లు వచ్చాయని, అవి కావాలంటే తాను చెప్పిన ఖాతాలో 5 శాతం కమిషన్ వేయాలని ఓ మోసగాడు చేసిన ఫోన్ కాల్ ను నమ్మిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రూ. 10 లక్షలు సమర్పించుకున్నారు. ఇదే విషయాన్ని ఆమె మీడియాకు వివరించారు.
తన పేరు బాలాజీ నాయుడు అని పరిచయం చేసుకున్న వ్యక్తి, తాను అపోలో ఆసుపత్రిలో ఉండగా ఫోన్ చేశాడని, నిధులు వచ్చాయని చెబితే నమ్మి, ఆ సంగతి చూడాలని తన భర్తకు చెప్పానని అన్నారు. ఆయన కూడా నమ్మి, తమ కుమారుడి ద్వారా బ్యాంకులో డబ్బు వేయించామని, ఆ తరువాత అదో ప్రైవేటు వ్యక్తి ఖాతా అని తెలిసిందని, సదరు నాయుడి ఫోన్ కూడా స్విచ్చాఫ్ వచ్చిందని అన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇదే బాలాజీనాయుడు గతంలో పలువురిని మోసం చేసినట్టు తెలిసిందని, తనకు ఈ ఘటన ఓ గుణపాఠమని, మరెవరూ తనలా మోసపోవద్దని సూచించారు.