KCR: కేసీఆర్ ప్రజల తిరస్కరణకు గురికావాల్సి వస్తుంది: ప్రొ.కోదండరామ్
- ఓయూ విద్యార్థి ఉద్యమ వేదిక భేటీలో కోదండరామ్ ప్రసంగం
- కేసీఆర్ తన బాధ్యతలను విస్మరించకూడదు
- కొలువులకై కొట్లాట సభ నిర్వహణకు, యాత్రకు కోర్టు అనుమతి ఇచ్చింది
హైదరాబాద్ తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీ కొత్త సమావేశ మందిరంలో ఈ రోజు ఓయూ విద్యార్థి ఉద్యమ వేదిక భేటీ జరిగింది. ఈ సమావేశానికి టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ హాజరయ్యారు. తెలంగాణలో 82 శాతం మంది విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు ఇవ్వకపోతే ఆ విద్యార్థులు చదువుకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ తన బాధ్యతలను విస్మరించకూడదని, ఒకవేళ అలా చేస్తే ప్రజల తిరస్కరణకు గురికావాల్సి వస్తుందని కోదండరామ్ చెప్పారు. తాము నిర్వహించాలనుకున్న కొలువులకై కొట్లాట సభ నిర్వహణకు, యాత్రకు కోర్టు అనుమతి ఇచ్చిందని ప్రకటించారు. లేనిపోని కారణాలు చెబుతూ సభను అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నించినా కోర్టు మాత్రం పోలీసుల వాదనను ఒప్పుకోలేదని హర్షం వ్యక్తం చేశారు.