Mumbai: బిడ్డకు పాలిస్తుండగా అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు.. కారుతో సహా తరలించిన ఖాకీలు!
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- పోలీసుల తీరుపై వెల్లువెత్తిన విమర్శలు
- దర్యాప్తుకు ఆదేశించిన ఉన్నతాధికారులు
ఫ్రెండ్లీ పోలీస్ అని ఎవరు ఎంతగా మొత్తుకుంటున్నా, తమ కరుకు గుండెలు మాత్రం మారబోవని ఖాకీలు నిరూపిస్తున్నారు. ముంబైలో జరిగిన తాజా ఘటన ఇందుకు మరో ఉదాహరణగా నిలుస్తోంది. కారులో వెళ్తున్న ఓ తల్లి తన బిడ్డ ఆకలితో ఏడుస్తుండడంతో కారును రోడ్డుపై ఆపి పాలిస్తోంది. రోడ్డుపై ‘నో పార్కింగ్’ ప్రదేశంలో ఆగిన కారును చూసిన ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. కారులో మహిళ ఉందని, ఆమె తన బిడ్డకు పాలిస్తోందని తెలిసినా ఏ మాత్రం కనికరం చూపలేదు. మానవత్వాన్ని మర్చిపోయారు.
మహిళ, చిన్నారి కారులో ఉండగానే రికవరీ వ్యాన్‌కు ఆ కారును తగిలించి తీసుకుపోయారు. తాను కారులో ఉన్నానని, బిడ్డకు పాలిస్తున్నానని మహిళ అరిచి గీపెట్టినా పోలీసులు పట్టించుకోలేదు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన ముంబై జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) అమితేష్ కుమార్ దర్యాప్తుకు ఆదేశించారు. తాను పాలిస్తున్నానని, తనకు ఆరోగ్యం సరిగా లేదని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని, కనీసం కిందకి దిగమని కూడా అడగలేదని బాధిత మహిళ జ్యోతి మలే మీడియాకు తెలిపింది.