Windies: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు యమా హ్యాపీ.. టూర్‌కు ఓకే చెప్పిన విండీస్ ఆటగాళ్లు!
- సస్పెన్స్‌కు తెరదించిన విండీస్ బోర్డు
- పాక్‌లో పర్యటించేందుకు అంగీకారం
- దేశంలో క్రికెట్ పునర్వైభవంపై పాక్ ధీమా
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి విండీస్ జట్టు తీపి కబురు అందించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు పాక్ వస్తామని చెప్పడంతో పాక్ ఫుల్ ఖుషీగా ఉంది. ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రకారం వచ్చే ఏడాది పాక్‌తో లాహోర్ వేదికగా విండీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. నిజానికి ఈ సిరీస్ ఈ నెలలోనే జరగాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల వచ్చే ఏడాదికి వాయిదా పడింది. వచ్చే ఏడాది మార్చి 29, 31, ఏప్రిల్ 1న మ్యాచ్‌లు జరగనున్నాయి.
విండీస్ పర్యటనపై తొలి నుంచీ నీలినీడలు కమ్ముకున్నాయి. భద్రతా కారణాల రీత్యా పాక్ వెళ్లేందుకు విండీస్ ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో సిరీస్ రద్దవడం ఖాయమని అనుకున్నారు. అయితే ఆటగాళ్లకు పూర్తి భద్రత కల్పిస్తామంటూ పీసీబీ హామీ ఇవ్వడంతో విండీస్ బోర్డు అంగీకరించింది.
లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన తర్వాతి నుంచి ఆ దేశంలో ఆడేందుకు పలుదేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పీసీబీ ఆర్థికంగా కునారిల్లుతోంది. దేశంలో తిరిగి మ్యాచ్‌లు నిర్వహించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో తటస్థ వేదికల్లో నిర్వహిస్తున్నారు. ఇటీవల శ్రీలంకతో సిరీస్‌ను దుబాయ్‌లో నిర్వహించగా, ఓ టీ20 మ్యాచ్‌ను మాత్రం లాహోర్‌లో నిర్వహించారు. కాగా, శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీసీబీ చైర్మన్ నాజమ్ సేథి మాట్లాడుతూ పాక్‌లో పర్యటించేందుకు విండీస్ జట్టు అంగీకరించినట్టు తెలిపారు.