prescription: మందులతో పాటు హనుమాన్ చాలీసా చదవాలని చెబుతున్న డాక్టర్!
- గుళ్లకు వెళ్లాలని, హారతుల్లో పాల్గొనాలని చెబుతున్న రాజస్థానీ వైద్యుడు
- పేషెంట్లలో మానసిక సాంత్వన కోసమేనంటున్న దినేశ్ శర్మ
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రిస్క్రిప్షన్ ఫొటోలు
తన దగ్గరికి వచ్చే పేషెంట్లకు ఈ రాజస్థానీ వైద్యుడు వీలైనంత మేరకు చికిత్స చేస్తాడు. వారికి కావాల్సిన మందులను రాసి ఇస్తాడు. ఆ మందులతో పాటు అదే ప్రిస్క్రిప్షన్ మీద రోజూ హనుమాన్ చాలీసా చదవాలని, గుళ్లకు వెళ్లాలని, దేవుళ్లకు హారతులు ఇవ్వాలని పేర్కొంటాడు. డాక్టర్ వృత్తిలో ఉండి ఇలా రాయడమేంటని ప్రశ్నించగా.. తాను అలా రాయడం వల్ల పేషెంట్లకు మానసిక సాంత్వన కలుగుతుందని సమాధానమిచ్చాడు.
రోగికి వ్యాధిని నయం చేయడంలో కృత్రిమ మందులతో పాటు ఆధ్యాత్మిక భావనలు కూడా సమాన భాగం పోషిస్తాయని రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాకు చెందిన డాక్టర్ దినేశ్ శర్మ అంటున్నారు. కడుపునొప్పితో బాధపడుతూ తన దగ్గరికి వచ్చిన శేఖర్ అనే టీవీ మెకానిక్‌కి అక్టోబర్ 13న ఆయన రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో మందులతో పాటు హనుమాన్ చాలీసా చదవాలని దినేశ్ శర్మ రాశాడు. ప్రభుత్వ వైద్యుడిగా సేవలందించి 1998లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న దినేశ్ శర్మ ఓ క్లినిక్ నడుపుతున్నాడు. రోజుకి రెండు సార్లు పేషెంట్లకు చికిత్స చేసే ఆయన చాలా మందికి ఇలాగే రాసిస్తానని చెబుతున్నాడు.