love: ప్రేమోన్మాది ఘాతుకం.. కుటుంబాన్ని అంతం చేసే యత్నం... ప్రియురాలు సజీవ దహనం!
- ఆరేళ్లు సాగిన గాఢమైన ప్రేమ
- తల్లిదండ్రుల హెచ్చరికల నేపథ్యంలో ప్రియుడిని దూరం పెట్టిన ఇందూజ
- ఉన్మాదిగా మారి ఇంట్లో దూరి తగులబెట్టిన ఆకాశ్
చెన్నైలోని ఆదంబాక్కంలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనతో పెళ్లికి అంగీకరించని ప్రియురాలి కుటుంబాన్ని అంతం చేసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో ప్రియురాలు సజీవదహనం కాగా, నిందితుడు పోలీసులకు లొంగిపోయి వాంగ్మూలమిచ్చాడు. దాని వివరాల్లోకి వెళ్తే... సేలంకు చెందిన షణ్ముగం (50), రేణుక (42) దంపతుల కుటుంబం చెన్నై ఆదంబాక్కం సరస్వతి నగర్ ఏడో వీధిలో స్థిర పడింది. వీరికి ఇందుజా (22), నివేద (20), మనోజ్ (15) అనే పిల్లలున్నారు. పెద్దకుమార్తె ఇందుజా గిండిలోని ఓ ప్రముఖ స్కూల్ లో చదువుకుంది. ఆ సమయంలో వేళచ్చేరికి చెందిన ముత్తుకుమార్ కుమారుడు ఆకాష్ (24)తో స్నేహం ఏర్పడింది. కాలేజీలో కూడా వీరి స్నేహం కొనసాగింది.
కొన్నాళ్లకు అది ప్రేమగా మారడంతో ఇద్దరూ పెద్దల కళ్లు గప్పి చెన్నైలో చెట్టాపట్టలేసుకుని తిరిగేవారు. తరువాత ఇందూజ బీటెక్ లో జాయినవ్వగా, ఆకాశ్ డిప్లోమాలో చేరాడు. పీకల్లోతు ప్రేమలో మునిగినా, ఇందుజా మాత్రం తన దృష్టిని చదువుల మీదే పెట్టింది. అయితే, ఆకాష్ చదువును అటకెక్కించాడు. ఇంతలో ఇందుజా తండ్రి బెంగళూరుకు బదిలీ కావడంతో వీరికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఆకాశ్ ఆమె ఇంటికి వచ్చేంత చనువు పెంచుకున్నాడు. ఇద్దరూ స్కూల్ మెట్సే కదా అని భావించిన తల్లి వారి స్నేహాన్ని కాదనలేదు. దీంతో ఆకాశ్ ఆ కుటుంబానికి బాగా దగ్గరయ్యాడు.
ఒక దశలో ఇందుజాను తనకు ఇచ్చి వివాహం చేయాలని ఆమె తల్లితో అన్నప్పటికీ ఆమె సరదా సంభాషణగా తీసుకున్నారు కానీ పట్టించుకోలేదు. దీంతో ఆరు నెలల క్రితం ఇందూజ విద్యాభ్యాసం పూర్తికావడంతో తరమణి ప్రాంతంలోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం తెచ్చుకుంది. దీంతో నాలుగు నెలల క్రితం ఆకాష్ తో ప్రేమ విషయాన్ని ఇందూజ తన తల్లి రేణుక దృష్టికి తీసుకెళ్లింది. అయితే, తల్లి వీరి వివాహానికి నిరాకరించింది. అప్పటినుంచీ ఇందూజ అతనిని దూరం పెట్టడం ప్రారంభించింది. దీంతో ఆకాశ్ కుంగిపోయాడు. ఆరేళ్లపాటు గంటకోసారి మాట్లాడే ఇందూజ అకస్మాత్తుగా తనను దూరం పెట్టడాన్ని ఆకాశ్ సహించలేకపోయాడు. దీంతో ఆమెను కలిసేందుకు శతవిధాలా ప్రయత్నించాడు.
కొద్ది రోజుల క్రితం అతికష్టం మీద ఆమెను కలవగా చదువును అటకెక్కించి, ఉద్యోగం, సద్యోగం లేకుండా తిరిగేవాడిని పెళ్లి చేసుకోవాలా? అని తన తల్లి రేణుక ప్రశ్నిస్తోందని, తనకు దూరంగా ఉండాలని ఇందుజా సూచించింది. తరువాత ఆమె ఇంటికి వెళ్లి ఆమె తల్లిని పలుమార్లు ప్రాధేయపడ్డా ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆకాష్ రెండు రోజుల క్రితం ఇందూజాను సహచర ఉద్యోగితో సన్నిహితంగా ఉండడాన్ని చూశాడు. అంతే.. ప్రేమోన్మాదిగా మారాడు. ప్లాన్ ప్రకారం టర్పంటైల్ క్యాన్ తో ఆమె ఇంటికి చేరుకున్నాడు. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో ఆమె ఇంటి తలుపుతట్టాడు. ఇందూజ తల్లి వచ్చి తలుపు తెరిచింది. మళ్లీ ప్రాధేయపడ్డాడు. ఈ సారి ఆమె ఉజ్జోగం, సజ్జోగం లేని ఇతర కులం వాడిని ఎలా చేసుకుంటామని ప్రశ్నిస్తున్న సమయంలో ఇందూజ కూడా వచ్చి, అతనిని హెచ్చరించింది.
అంతే అక్కడే దాచిన క్యాన్ ను బయటకు తీసి, క్షణాల్లో ఇంట్లోకి దూరి, ఇందూజ మీద పోశాడు. అతనిని అడ్డుకునేందుకు వచ్చిన ఆమె తల్లి, చెల్లి మీద కూడా పోసి, నిప్పంటించాడు. మంటలు క్షణాల్లో ఆవహించాయి. ఇంట్లో ఉన్న మనోజ్ వచ్చేసరికి ఆకాశ్ పారిపోయాడు. వారి కేకల్ని విన్న ఇరుగుపొరుగు వచ్చి, వారిని రక్షించే ప్రయత్నం చేసేలోపు ఇందూజ సజీవదహనమైంది. తీవ్రగాయాలపాలైన రేణుక, నివేదలను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆకాశ్ ఆదంబాక్కం పోలీసుల స్టేషన్ లో లొంగిపోయాడు. అనంతరం తన ప్రేమ పయనం నుంచి ఉన్మాదం వరకు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చి నేరాన్ని అంగీకరించాడు.