Farooq Abdullah: అదే జరిగితే పాక్ చూస్తూ ఊరుకోదు.. మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫరూక్ అబ్దుల్లా
- పాక్ అంత బలహీనమైన దేశం ఏమీ కాదు
- జమ్ము కశ్మీర్ మాత్రమే మనది
- వాస్తవాధీన రేఖ వెంబడి ప్రజలు స్వేచ్ఛగా తిరిగే రోజు వస్తుంది
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను భారత్ స్వాధీనం చేసుకుంటుంటే పాకిస్థాన్ చూస్తూ ఊరుకోదని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పీవోకే పాకిస్థాన్దేనంటూ ఇటీవల వ్యాఖ్యానించిన ఆయన తాజా వ్యాఖ్యలు మరోమారు వివాదాస్పదమయ్యాయి.
బారాముల్లాలోని ఉరీలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పీవోకే మనదేనని ఎన్నాళ్లు చెప్పుకుంటామని ప్రశ్నించారు. పీవోకే పాక్దేనని, జమ్ముకశ్మీర్ మాత్రం భారత్దని పేర్కొన్నారు. పీవోకే భారత్లో అంతర్భాగమని భారత్ చెబుతోందని, మరిదానిని భారత్లో ఎలా కలుపుతారో చూస్తామని అన్నారు. భారత్ కనుక పీవోకేను స్వాధీనం చేసుకుంటూ ఉంటే పాకిస్థాన్ చూస్తూ ఊరుకునే రకం కాదని అన్నారు. పాక్ మనం ఊహించుకున్నంత బలహీన దేశం కాదన్నారు. అయితే వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ప్రజలు స్వేచ్ఛగా తిరిగే రోజు తప్పకుండా వస్తుందని ఫరూక్ ఆశాభావం వ్యక్తం చేశారు.