padmawati: దీపికా పదుకొనే బజారు డ్యాన్సులను అంగీకరించే ప్రసక్తే లేదు: రాజ్ పుత్ కర్ణి సేన
- పొట్టి దుస్తులు వేసుకుని నృత్యాలు చేసిన దీపిక
- 'పద్మావతి' విడుదలను అడ్డుకుని తీరుతాం
- రాజ్ పుత్ కర్ణి సేన చీఫ్ లోకేంద్ర సింగ్ కాల్వి
సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నిర్మితమైన 'పద్మావతి' చిత్రాన్ని అడ్డుకుని తీరుతామని శ్రీ రాజ్ పుత్ కర్ణి సేన స్పష్టం చేసింది. చిత్రం విడుదలను వ్యతిరేకిస్తున్న కర్ణి సేన, డిసెంబర్ 1న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలోని దీపికా పదుకొనే నృత్యాలను కర్ణి సేన చీఫ్ లోకేంద్ర సింగ్ కాల్వి తీవ్రంగా విమర్శించారు.
"ఈ చిత్రంలో దీపిక పొట్టి దుస్తులు ధరించి బజారు డ్యాన్సులు చేసింది. మహిళలను అగౌరవపరచవద్దని దీపికను యాచిస్తున్నాను. భారత మహిళను నువ్వు ఎలా చూపించాలని అనుకుంటున్నావు? ఇండియా వెనుకబడి పోవడం లేదు. నువ్వే వెనక్కు లాగుతున్నావు" అని ఆయన విరుచుకుపడ్డారు. దీపిక తనకు కుమార్తె వంటిదని చెబుతూనే, పద్మావతి చిత్రానికి అండర్ వరల్డ్ మాఫియా పెట్టుబడులు పెట్టిందని ఆరోపించారు. చరిత్రలోని నిజాలను వక్రీకరించేలా చిత్రం ఉందని ఆరోపించారు. ఈ చిత్రాన్ని విడుదల కానిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా, రాజ్ కర్ణి కార్యకర్తల బెదిరింపులతో సంజయ్ లీలా బన్సాలీకి సెక్యూరిటీని పెంచాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది.