nagam janardhan reddy: కాంగ్రెస్ లో చేరనున్న నాగం జనార్దన్ రెడ్డి.. నాగర్ కర్నూలు నుంచే అసెంబ్లీ బరిలోకి!
- నాగర్ కర్నూలులో తిరుగులేని నేతగా ఉన్న నాగం
- మారిన పరిస్థితుల్లో ప్రస్తుతం బీజేపీలో
- జాతీయ పార్టీలో ఉన్నా క్రియాశీలకంగా లేని నాగం
- కాంగ్రెస్ లో చేరి, అసెంబ్లీ బరిలోకి దిగనున్న టీడీపీ మాజీ నేత
తెలుగుదేశం పార్టీ మాజీ నేత, ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నా, క్రియాశీలకంగా లేని నాగం జనార్దన్ రెడ్డి, త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి నాగర్ కర్నూలు నుంచి బరిలోకి దిగుతారని తెలుస్తోంది. 1999 నుంచి మూడు వరుస ఎన్నికల్లో, ఆపై 2012 ఉప ఎన్నికల్లో నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు ప్రత్యర్థులుగా ఢీకొనగా, ప్రతిసారీ నాగం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక మారిన రాజకీయాల్లో భాగంగా ఇద్దరి మధ్యా పరస్పర సహకారం కోసం ఒప్పందం కుదిరిందని, గతంలో దామోదర్ రెడ్డి స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గెలిచేందుకు నాగం సహకరించారని తెలుస్తోంది.
ఇద్దరమూ పోటీ పడకుండా, ఎవరో ఒకరే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని ఇద్దరి మధ్యా డీల్ కుదిరిందని కూడా కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగం పార్టీ మారే విషయమై రోజురోజుకూ ఊహాగానాలు పెరుగుతూ ఉండగా, నియోజకవర్గంలో ఇంటింటికీ పరిచయం ఉన్న తాను సులువుగా విజయం సాధిస్తానని నాగం ధీమా వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా సానుకూలంగా ఉండటంతో త్వరలోనే ఆయన పార్టీ మార్పు తెరపైకి వస్తుందని తెలుస్తోంది.