rains: ఉత్తరకోస్తాకు పెనుగండం.. వైజాగ్ కు 80 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం!
- కోతకొచ్చిన వరి పంట
- వాయుగుండం కారణంగా వర్షాలు కురిసే అవకాశం
- పంట ఏమవుతుందోనని రైతుల ఆందోళన
ఎండనక వాననక, పగలనక రాత్రనక ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కోతకొచ్చాయి. మరో వారంరోజుల్లో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభం కాబోతున్నాయి. సరిగ్గా ఈ దశలో వరుణుడు కన్నెర్రజేస్తున్నాడని రైతులు వాపోతున్నారు. విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైఉంది.
దీంతో ఉత్తరకోస్తా తీరం వెంబడి తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉందని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఈ వాయుగుండం నెమ్మదిగా కదులుతోందని, ఒడిశా, ఉత్తరకొస్తా మధ్యలో తీరందాటే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కోతకు రావడంతో వాణిజ్య పంటగా వేసిన పెసలు, మినుములు మొలుస్తాయా? అన్న ఆందోళనలో ఉన్నారు.