deepika padukone: అవసరమైతే దీపికా పదుకునే ముక్కు కోస్తాం... వీడియోలో హెచ్చరించిన కర్ని సేన సభ్యుడు
- రాజ్పుత్ మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్న సినిమా
- కొనసాగుతున్న నిరసనలు
- డిసెంబర్ 1న బంద్ పాటించే అవకాశం
విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ 'పద్మావతి' వివాదం ఇంకాస్త రగులుతోంది. రాజ్పుత్ మహిళలను కించపరిచినందుకు అవసరమైతే నటి దీపికా పదుకునే మీద కూడా చర్యలు తీసుకుంటామని కర్ని సేన హెచ్చరిస్తోంది. ఈ వివాదం గురించి కర్ని సేన సభ్యుడు మహిపాల్ సింగ్ మకరానా ఓ వీడియో విడుదల చేశాడు. అందులో దీపికా పదుకునే మీద చర్య తీసుకునేందుకు కూడా తాము వెనకాడబోమని హెచ్చరించాడు.
'సినిమాల్లో మహిళలను చూపిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాజ్పుత్ కర్ని సేన పోరాడుతోంది. మేం ఇప్పటివరకు ఆడవారి మీద చేయి ఎత్తలేదు. కానీ ఈ పోరాటంలో భాగంగా భారత సంస్కృతిని కించపరిచినందుకు శూర్పణఖకు లక్ష్మణుడు చేసిన పనినే మేం దీపికాకు చేయడానికి వెనుకాడం' అని మహిపాల్ సింగ్ అన్నాడు. ఈ సినిమాకు వ్యతిరేకంగా రాజస్థాన్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. వారంతా కలిసి డిసెంబర్ 1న బంద్ పాటించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.