Rahul Gandhi: రాహుల్ గాంధీ 'బంగారు యంత్రం'.. అసలు జరిగింది ఇదీ!

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • 26 నిమిషాలు మాట్లాడితే 20 సెకన్ల వీడియో పోస్ట్
  • అసలు నిజం ఇదే అంటూ మొత్తం వీడియో విడుదల

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏం చేసినా ఇటీవల వైరల్ అయిపోతోంది. తాజాగా రాహుల్ మాట్లాడినట్టుగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాను ఊపేసింది. రాహుల్‌ను విమర్శిస్తూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా అహ్మదాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ... తాను ఆలుగడ్డ (బంగాళదుంప)తో బంగారం తయారుచేసే యంత్రాన్ని తీసుకొస్తానని చెప్పారు. ఇటువైపు నుంచి ఆలుగడ్డ పెడితే అటువైపు నుంచి బంగారం వస్తుందని చేతులు ఊపుతూ చెప్పారు. అంత డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక ప్రజలు బుర్రలు బద్దలుగొట్టుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. కొందరైతే ఆ మెషీన్‌ కోసం ఆర్డర్లు కూడా చేశారు. ఇంకొందరు రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రాహుల్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీ ప్రభుత్వం విధానాలపైనా, ప్రధాని నరేంద్రమోదీపైనా విరుచుకుపడుతున్నారు. అయితే తాజా ఘటన అందుకు పూర్తిగా విరుద్ధం.

‘‘ఇటువైపు నుంచి ఆలుగడ్డ పెడితే అటువైపు నుంచి బంగారం బయటకు వస్తుంది. అలాంటి మెషీన్‌ను తీసుకొస్తా’’ అని రాహుల్ అన్నట్టు ఉన్న 20 సెకండ్ల వీడియో సంచలనమైంది.

రాహుల్ అలా అన్న మాట వాస్తవమే అయినా ఇందులో ఓ తిరకాసు కూడా ఉంది. రాహుల్ మొత్తం 26 నిమిషాలు మాట్లాడితే అందులో కేవలం 20 సెకన్ల పాటు ఉన్న వీడియోను కట్ చేసి అప్‌లోడ్ చేశారు. నిజానికి రాహుల్ మొత్తం 26  నిమిషాలు మాట్లాడితే అందులో 17 నిమిషాలు ప్రధాని మోదీని ఎండగట్టారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రధాని రూ.40వేల కోట్లు ఇస్తామన్నారని, కానీ పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నెలరోజుల క్రితం ఇక్కడ వరదలు వస్తే రూ. 500 కోట్లు సాయం చేస్తానన్నారని కానీ, రూపాయి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.

మోదీ ఇటీవల ఓ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ‘‘ఐసీ మిషన్ లగా ఊంగా, ఇస్ సైడ్ సే ఆలూ గుసేగా, ఉస్ సైడ్ సే సోనా నికలేగా’’ (ఈ వైపు నుంచి ఆలుగడ్డలు పెడితే, ఆవైపు నుంచి బంగారం వస్తుంది. అలాంటి మెషీన్‌ను తీసుకొస్తా) అని ప్రధాని అన్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రాహుల్ వీడియో వెనక ఉన్న అసలు రహస్యం ఇదన్నమాట!

  • Loading...

More Telugu News