Virat Kohli: కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏదో ఒకటి చెయ్యండయ్యా.. ఢిల్లీవాసులను కోరిన కోహ్లీ!
- కాలుష్యాన్ని నియంత్రించేందుకు చేయిచేయి కలపాలని పిలుపు
- ట్విట్టర్లో వీడియో పోస్ట్
- తనతో అంగీకరించేవారు షేర్ చేసి మద్దతు తెలపాలన్న కోహ్లీ
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య భూతం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న వేళ టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఢిల్లీ వాసులను అభ్యర్థిస్తూ ఓ ట్వీట్ చేశాడు. నగరంలోని కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏదో ఒకటి చేయండంటూ పిలుపునిచ్చాడు. ఢిల్లీ హ్యాష్‌టాగ్‌తో ఓ షార్ట్ వీడియోను పోస్ట్ చేశాడు. కాలుష్యంపై ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం వచ్చిందని, ప్రస్తుత పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఏదో ఒకటి చేయాలని పిలుపునిచ్చాడు.
‘‘హే గైయ్స్.. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పరిస్థితుల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ విషయంపై మీరు దృష్టి సారిస్తారనే ఉద్దేశంతో మీకు గుర్తు చేస్తున్నా. ప్రస్తుత పరిస్థితికి కారణం ఏంటనే దాని గురించి చాలామంది మాట్లాడుతున్నారు. అయితే మనం ఏం చేస్తున్నామనే విషయం గురించి పట్టించుకోవడం లేదు. మనందరం ముందుకొచ్చిన రోజే కాలుష్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న మ్యాచ్‌లో విజయం సాధించగలం’’ అని ఈ ఢిల్లీ కుర్రోడు తన ట్వీట్లో పేర్కొన్నాడు.
కాలుష్య నివారణ కోసం కదలడం మన బాధ్యత అని గుర్తు చేసిన కోహ్లీ.. ప్రతి ఒక్కరు మెట్రో తదితర పబ్లిక్ వాహనాలను విరివిగా ఉపయోగించుకోవాలని సూచించాడు. తమ వాహనాల్లో మరొకరికి చోటివ్వడం ద్వారా కాలుష్యాన్ని కొంత వరకు తగ్గించవచ్చని అభిప్రాయపడ్డాడు. కాలుష్యాన్ని తగ్గించేందుకు మనం చేసే ప్రతి చిన్న పని విజయవంతమవుతుందని, తన పోస్టుతో అంగీకరించిన వారు దీనిని షేర్ చేస్తూ మద్దతు తెలపాలని కోహ్లీ కోరాడు.