MS Dhoni: 2007లో నన్ను కెప్టెన్ గా చేయడానికి కారణం ఇదే: ధోనీ

  • అప్పట్లో జట్టులో ఉన్న పిన్న వయస్కులలో నేనూ ఒకడిని
  • సీనియర్లు అడిగితే అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పేవాడిని
  • వాంఖడేలో ప్రపంచకప్ గెలవడం గొప్ప అనుభూతిని మిగిల్చింది

మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్ అయిన తర్వాత టీమిండియా ఎన్నో ఘన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. అసలు ధోనీ కెప్టెన్ కావడం కూడా ఎవరూ ఊహించని విషయమే. మొత్తమ్మీద 199 వన్డేలకు ధోనీ కెప్టెన్ గా వ్యవహరించగా, వాటిలో 110 మ్యాచ్ లలో ఇండియా గెలిచింది. వీటిలో ఇండియాలో 73 మ్యాచ్ లు జరగగా, అందులో 43 మ్యాచ్ లలో జయభేరి మోగించింది. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 2011లో ప్రపంచకప్, 2007లో వరల్డ్ టీ20 టైటిల్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. టెస్టుల్లో కూడా నెంబర్ వన్ గా నిలిచింది.

తాను కెప్టెన్ అయిన సందర్భాన్ని ధోనీ మరోసారి గుర్తు చేసుకున్నాడు. తనను కెప్టెన్ చేయాలన్న సమావేశంలో తాను భాగస్వామి కాదని చెప్పాడు. గేమ్ పై అవగాహన, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం తనకు కలసివచ్చాయని తెలిపాడు. గేమ్ పరిస్థితులను అంచనా వేయడం చాలా ముఖ్యమని చెప్పాడు. అప్పట్లో జట్టులో తక్కువ వయసున్న వారిలో తాను కూడా ఒకడినని... అయినప్పటికీ, తన అభిప్రాయాలను సీనియర్ ఆటగాళ్లు అడిగితే సూటిగా చెప్పేవాడినని, గేమ్ కు సంబంధించి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేందుకు వెనుకాడేవాడిని కాదని తెలిపాడు. ఈ లక్షణాలే తాను కెప్టెన్ కావడానికి దోహదపడ్డాయిని చెప్పాడు.

వాంఖడే స్టేడియంలో 2011 ప్రపంచకప్ ను గెలుచుకోవడం ఎంతో గొప్ప అనుభూతిని మిగిల్చిందని తెలిపాడు. మనం గెలవడానికి నాలుగు, ఐదు ఓవర్ల ముందే మనం గెలవబోతున్నాం అనే విషయం స్టేడియంలోని ప్రేక్షకులందరికీ అర్థమైపోయిందని... అందరూ లేచి వందేమాతరంతో పాటు ఇతర పాటలను పాడటం ప్రారంభించారని... అలాంటి సన్నివేశం మళ్లీ రాలేదని... భవిష్యత్తులో అలాంటి సన్నివేశాన్ని మళ్లీ చూస్తామని ధోనీ చెప్పాడు.  

  • Loading...

More Telugu News