nandi awards: 'రుద్రమదేవి'లో బన్నీ ఉచితంగా నటించాడు.. కావాలంటే గుణశేఖర్ ని అడగండి!: నిర్మాత ఎన్వీప్రసాద్
- నంది అవార్డులు నిజాయతీగా లేవు
- రుద్రమదేవి ఎందుకు అనర్హమైంది?
- గుణశేఖర్ ఆస్తులు అమ్మి అద్భుతంగా రూపొందించిన సినిమాకు అన్యాయం జరిగింది
- నిర్మాత ఇబ్బందులను చూసి రూపాయి కూడా తీసుకోకుండా బన్నీ నటించాడు
నంది అవార్డులు మంచి సినిమాలకు ఇవ్వలేదంటూ తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఒక టీవీఛానెల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న నిర్మాత ఎన్వీప్రసాద్ మాట్లాడుతూ, 'రుద్రమదేవి' అనే తెలుగు సినిమా అవార్డందుకోకపోవడానికి ఉన్న అనర్హత ఏమిటని ప్రశ్నించారు. ఆ సినిమా తెలుగు జాతికి సంబంధించిన చారిత్రాత్మక సినిమా అని, అలాంటి సినిమా రాయితీ పొందేందుకు అర్హత సాధించలేకపోయిందని, ఇప్పుడు అవార్డుకు కూడా అర్హత సాధించలేకపోయిందని ఆయన విమర్శించారు.
ఆ సినిమాను అత్యంత క్లిష్టపరిస్థితుల్లో దర్శకుడు పూర్తి చేశాడని అన్నారు. ఈ సినిమా నిర్మాణం పూర్తి చేసేందుకు ఆస్తులు అమ్ముకున్నాడని ఆయన తెలిపారు. ఆ సినిమా నిర్మాణంతో దర్శకుడు గుణశేఖర్ ఇబ్బందుల్లో ఉన్నాడని గుర్తించిన బన్నీ.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించాడని ఆయన తెలిపారు. కావాలంటే గుణశేఖర్ ని ఫోన్ లైన్లోకి తీసుకుని నిజమా? కాదా? అన్నది నిర్ధారించుకోవాలని ఆయన సూచించారు. నంది అవార్డుల్లో అన్యాయం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. అలాంటి సినిమాలకు అవార్డులిచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.