terrorist: ఉగ్రవాదులతో చేతులు కలిపాడు.. అంతలోనే సైన్యంకి లొంగిపోయాడు!
- జమ్ముకశ్మీర్ ఫుట్ బాల్ జట్టు సభ్యుడైన మజీద్ ఇర్షాద్ ఖాన్
- వారం క్రితం ఇంటి నుంచి పారిపోయి ఏకే 47తో సోషల్ మీడియాలో ప్రత్యక్షం
- లష్కరే తోయిబాలో చేరుతున్నట్టు ప్రకటన
- తల్లిదండ్రుల విజ్ఞప్తి మేర లొంగిపోయిన వైనం
విద్యావంతుడు, ప్రతిభావంతుడైన మజీద్ ఇర్షాద్ ఖాన్ జనజీవన స్రవంతిలో కలవాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరడంతో సైన్యం ఎదుట లొంగిపోయిన ఘటన జమ్ముకశ్మీర్ లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... జమ్ముకశ్మీర్ ఫుట్ బాల్ జట్టు ఆటగాడు మజీద్ ఇర్షాద్ ఖాన్ వారం రోజుల క్రితం ఇల్లువిడిచి పారిపోయాడు. అనంతరం కొన్ని గంటల్లోనే ఏకే 47 తుపాకీతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టాడు.
తాను ఉగ్రవాదుల్లో కలిసినట్టు, లష్కరే తొయిబాలో చేరినట్టు ప్రకటించాడు. దీంతో అతని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. హింసను విడనాడి, జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. ఇర్షాద్ తండ్రి ప్రభుత్వోద్యోగి కాగా, తల్లి గృహిణి. వారి ఆవేదన అర్థం చేసుకున్నాడో లేక ఉగ్రవాదం సరైనది కాదనిపించిందో కానీ గురువారం రాత్రి 11:30 నిమిషాల సమయంలో సైన్యం ముందు లొంగిపోయాడు.