team india: మూడో రోజు కూడా కొనసాగిన బౌలర్ల ఆధిపత్యం...172 పరుగుల వద్ద ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్!
- వర్షం కారణంగా తొలి రెండు రోజులు తక్కువ సేపు సాగిన ఆట
- మూడోరోజూ కూడా కొనసాగిన శ్రీలంక బౌలర్ల ఆధిపత్యం
- 172 పరుగుల వద్ద ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్
కోల్ కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో శ్రీలంక బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. మూడో రోజు ఆట ఆరంభంలోనే ఛటేశ్వర్ పుజారా అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అనంతరం వ్యక్తిగత స్కోరుకు కేవలం ఐదు పరుగులు జతచేసిన పుజారా (52) గమగే వేసిన అద్భుతమైన బంతికి బౌల్డ్ అయ్యాడు. అనంతరం సాహా (29) కు జడేజా (22) జతకలిశాడు. వీరిద్దరూ నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టీమిండియా సెంచరీ మార్కును దాటింది. అనంతరం వీరిద్దరూ పెరీరా బౌలింగ్ లో అవుటయ్యారు.
జట్టు స్కోరు 146 పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్ (13) లక్మల్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత మహ్మద్ షమి (24)కి జతకలిసిన ఉమేష్ యాదవ్ 6 పరుగులను జత చేశాడు. షమి లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వరుసగా భారీ షాట్లు ఆడుతూ ఆకట్టుకున్నాడు. బంతిని బౌండరీ దాటించే ప్రయత్నంలో బౌండరీ లైన్ వద్ద గమగేకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 172 పరుగుల వద్ద ముగిసింది.