gold medal: రెజ్లింగ్ టోర్నీలో సునాయాసంగా స్వర్ణం సాధించిన సుశీల్ కుమార్!
- రైల్వేస్ తరపున బరిలో దిగిన సుశీల్ కుమార్
- 2 నిమిషాల 33 సెకెన్ల పోరుతో స్వర్ణం సాధన
- సాక్షి మాలిక్, గీతా ఫోగాట్ కు కూడా స్వర్ణపతకాలు
జాతీయ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో ఏమాత్రం శ్రమపడకుండా ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ (34) స్వర్ణం సాధించాడు. రైల్వేస్ తరపున బరిలో దిగిన సుశీల్ కుమార్ టోర్నీ మొత్తంలో స్వర్ణం కోసం పోరాడిన సమయం కేవలం 2 నిమిషాల 33 సెకన్లు కావడం విశేషం. ఆరంభ రౌండ్లలో ప్రత్యర్థులను నిమిషంలోపే చిత్తుచేసిన సుశీల్ కుమార్ కు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో వాకోవర్ లభించింది. అనంతరం సెమీ ఫైనల్ లో కూడా వాకోవర్ లభించింది.
దీంతో ఆ రెండు మ్యాచ్ లు ఆడకుండానే ఫైనల్ కు చేరాడు. అనంతరం ఫైనల్ లో సుశీల్ ప్రత్యర్థి ప్రవీణ్ రాణా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో వరుసగా మూడు వాకోవర్లు లభించాయి. ఫైనల్లో టోర్నీ విజేతగా నిలిచిన సుశీల్ కుమార్ స్వర్ణపతకం సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలో ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మాలిక్, గీతా ఫొగట్ లు కూడా తమతమ విభాగాల్లో స్వర్ణపతకాలు సాధించారు.