Laxmis veeragrandham: చంద్రబాబును కలిసిన ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ డైరెక్టర్.. లక్ష్మీపార్వతి నుంచి రక్షణ కల్పించాలని వేడుకోలు!
- లక్ష్మీపార్వతి నుంచి తనకు, సినిమా యూనిట్‌కు ప్రాణహాని ఉందని ఆవేదన
- సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కేతిరెడ్డి
- ఆది నుంచి వివాదాల్లో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’
‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిశారు. వైసీపీ నేత లక్ష్మీపార్వతి నుంచి తనకు, సినిమా యూనిట్‌కు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. తాను సచివాలయంలో చంద్రబాబును కలిసి తన బాధను ఆయనకు వివరించినట్టు కేతిరెడ్డి తెలిపారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా చంద్రబాబును కోరానని, ఆయన సానుకూలంగా స్పందించారని కేతిరెడ్డి పేర్కొన్నారు.
‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా పేరు ప్రకటించినప్పటి నుంచే టాలీవుడ్లో ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. వైసీపీ నేత లక్ష్మీపార్వతి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో వివాదం మొదలైంది. ఈ సినిమాకు తన అనుమతి లేదని, కాబట్టి సినిమాను నిలిపేయాలని లక్ష్మీపార్వతి స్వయంగా కేతిరెడ్డిని హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో షూటింగ్ చేపట్టగా లక్ష్మీపార్వతి అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.