satya: స్కాచ్ బాటిల్ పంపి నంది అవార్డు అడిగారు: ఆర్ట్ డైరెక్టర్ చంటి సంచలన కామెంట్
- తొలి సమావేశంలోనే చాయ్ బిస్కెట్లపై మాటలు
- తమకు వచ్చే కన్వీనియన్స్ పై చర్చలు
- 2013 అవార్డుల కమిటీ సభ్యుడు ఆర్ట్ డైరెక్టర్ చంటి కీలక వ్యాఖ్యలు
తమకు లభించే కన్వీనియన్స్ లు, అందే టిఫిన్, చాయ్, బిస్కెట్లపైనే నంది అవార్డు కమిటీ సభ్యులు తొలి సమావేశంలోనే మాట్లాడుకోవడంతో తాను అవాక్కయ్యానని, 2013 నంది అవార్డుల కమిటీ సభ్యుడు, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ చంటి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఓ టీవీ చానల్ నంది అవార్డుల వివాదంపై లైవ్ డిబేట్ నిర్వహించగా, చంటి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పెద్దమనిషి తనకు ఫోన్ చేసి, మిగతా అందరినీ మేనేజ్ చేశాను తన సినిమాకు అవార్డు ప్రకటించేందుకు సహకరించాలని కోరితే, మరో ప్రముఖ వ్యక్తి ఏకంగా ఓ పార్సిల్ పంపారని చెప్పారు. అందులో స్కాచ్ బాటిల్ ఉందని, మద్యం పంపి నంది అవార్డు ఇవ్వాలని అడిగారని వివరించారు.
ఏంటండీ స్కాచ్ బాటిల్ పంపారని సదరు వ్యక్తిని అడిగితే, మిగతా వారంతా ఒప్పుకున్నారని, తన సినిమాకు అవార్డు వచ్చేలా చూడాలని ఆయన అడిగాడని అన్నారు. ఆ రోజు నుంచి తాను ఒక్క కమిటీ సమావేశానికి కూడా వెళ్లలేదని చెప్పుకొచ్చారు. సినిమాలు చూడకుండానే అవార్డుల జాబితా తయారు చేసినట్టు అనుమానం వస్తోందని అన్నారు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ తో పాటు, ప్రభుత్వ ఉద్యోగులను, సంఘంలోని ఇతర వర్గాల ప్రముఖులను కూడా కమిటీలో భాగం చేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు.