Nandi Awards: నంది అవార్డులపై ప్రభుత్వం యూ టర్న్.. వివాదంపై సీరియస్.. రద్దు చేసే యోచన?

  • నందుల ప్రకటనతో తెలుగు సినీ పరిశ్రమలో కల్లోలం
  • తీవ్రస్థాయిలో విమర్శలు.. అవార్డులకు కులం రంగు
  • ఏపీ ప్రభుత్వం సీరియస్
  • నందులను రద్దు చేసే యోచనలో చంద్రబాబు సర్కారు

సినీ పరిశ్రమలో చినుకుగా ప్రారంభమైన ‘నందుల’ వ్యవహారం క్రమంగా వాయుగుండంగా మారి తీవ్ర తుపానుగా తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. రాష్ట్ర విభజన అనంతరం మూడేళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డులు పరిశ్రమలో కల్లోలం సృష్టించాయి. పరిశ్రమ ఎక్కడున్నా ప్రాంతాలకు అతీతంగా కళాకారులను గౌరవించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు తీవ్ర వివాదాన్ని రేపాయి. అనుయాయులకు, తమ కులం వారికి ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు మరింత శ్రుతిమించి అవి నంది అవార్డులు కాదు.. సైకిల్ అవార్డులని కొందరు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ విషయంలో సినీ పరిశ్రమ రెండుగా విడిపోయింది. దీనిపై పెద్ద ఎత్తున డిబేట్లు కూడా జరిగాయి.

ఈ విషయంలో ఇలాగే మౌనం వహిస్తే తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఏపీ ప్రభుత్వానికి కూడా మచ్చ వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన చంద్రబాబు సర్కారు మౌనం వీడింది. అవార్డుల విషయంలో జరుగుతున్న రాద్దాంతంపై స్పందించింది. ఈ వ్యవహారం మరింత శ్రుతిమించితే ఏకంగా అవార్డులనే రద్దు చేయాలన్న ఆలోచనలో ఉంది. కళాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అవార్డులు ఇస్తుంటే ఈ గోల ఏమిటంటూ ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.  

అవార్డులను ఇవ్వడం ఇదే తొలిసారి కాదని, కొన్ని దశాబ్దాలుగా ఇస్తున్నామని, ప్రతిసారి కొంత రచ్చ జరగడం మామూలే అయినా ఈసారి అది శ్రుతి మించిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ చేయడంలో భాగంగా ఏదో కుట్ర జరుగుతోందని భావించాల్సి వస్తోందని పేర్కొంది. నంది అవార్డులతో సంబంధం ఉన్న, లేని అంశాలను జోడించి మరీ వివాదాస్పదం చేస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
 
రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణలోనే ఉంటూ, అక్కడే పన్నులు కడుతున్నా తెలుగు వారంతా ఒక్కటే అన్న ఉద్దేశంతో అవార్డులు ఇస్తుంటే అనవసర రాద్దాంతం చేయడం ఎంత వరకు సబబు? అని ప్రశ్నించింది. ఈసారి నంది అవార్డు గ్రహీతల్లో చాలామందికి ఏపీలో కనీసం ఓటు హక్కు కూడా లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. విదేశాల్లో ఉంటున్న తెలుగు వారు ఏపీలో ఆస్తులు కొనుక్కుని, ఇక్కడ కంపెనీలు పెడుతుంటే, తెలంగాణలో ఉన్న కొందరు సినీ ప్రముఖుల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని ఆరోపించింది.
 
 నంది అవార్డుల ఎంపిక కోసం కమిటీలను ఏర్పాటు చేయడం వరకే ప్రభుత్వం బాధ్యత అని, ఎంపికలో దాని ప్రమేయం ఉండదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అలా ఎంపికైన కమిటీలకు చైర్మన్లుగా గిరిబాబు, జీవిత, పోకూరి బాబూరావు ఉన్నారని, వారేమీ అనామకులు కాదని, అత్యంత అనుభవజ్ఞులని గుర్తు చేస్తున్నారు. వారు రూపొందించిన జాబితాను ఆమోదించడం తప్ప ప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకోదని చెబుతున్నారు. కాబట్టి వివాదాలను పక్కనపెట్టాలని ప్రభుత్వ వర్గాలు కోరుతున్నాయి. వివాదం ఇలాగే కొనసాగితే అవార్డులను పూర్తిగా రద్దు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని అత్యంత విశ్వసనీయ  సమాచారం.

  • Loading...

More Telugu News