Nagarjuna: నాకు మైండ్ దొబ్బలేదు: వర్మకు స్టేజ్ పైనే కౌంటరిచ్చిన నాగార్జున
- నా మైండ్ బాగానే ఉంది
- 'శివ' హిట్ అవుతుందని అనుకోలేదు
- ఇప్పుడీ సినిమా విషయంలోనూ అంతే
- వర్మపై నమ్మకం ఉంచి ఓకే చెప్పాను
- ముహూర్తపు షాట్ తరువాత నాగార్జున
తనకు మైండ్ దొబ్బిందని, మిగతావి ఈ సినిమా తరువాత తెలుస్తాయని తన తాజా చిత్రం ముహూర్తపు షాట్ సందర్భంగా రాంగోపాల్ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున స్పందించాడు. "నాకు మైండ్ దొబ్బలేదు... నా మైండ్ బాగానే ఉంది" అంటూ వర్మకు వేదికపై నుంచే కౌంటరిచ్చాడు నాగ్. ఈ చిత్రం తనకు చాలా ఎక్సయిట్ మెంట్ ను కలిగిస్తోందని, రెగ్యులర్ షూటింగ్ కు ఎప్పుడెప్పుడు వెళదామా అని ఉందని చెప్పాడు.
ఇవాళ పొద్దున్నే నాలుగింటికే ఆత్రంగా లేచానని, రోజూ ఇలాగే ఉంటే బాగుంటుందని అన్నాడు. సినిమా హిట్ అవుతుందా? హిట్ అవదా? అనేది 'శివ' సమయంలో అనుకోలేదని, ఇప్పుడు కూడా అనుకోవడం లేదని చెప్పాడు. ఓ గట్టి నమ్మకంతో ఈ సినిమాను ప్రారంభించానని చెప్పాడు. వర్మకు తనపై, తనకు వర్మపై నమ్మకం ఉందని, అందువల్లే సినిమాకు ఓకే చెప్పానని అన్నాడు. తాను మాట్లాడలేకపోతున్నానని, నాన్నగారు అన్న మాటలు ఈ సమయంలో గుర్తుకొస్తున్నాయని చెప్పాడు.
"ఓ ఆర్టిస్టుకు గానీ, మనిషికి గానీ, 28 ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుంది. మనిషిగా నాకు మెచ్యూరిటీ వచ్చిన వేళ 'శివ' తీశాం. ఆపై మరో 28 ఏళ్లకు ఈ సినిమా తీస్తున్నాం" అన్నాడు. డబుల్ మెచ్యూరిటీ, డబుల్ పరిపూర్ణతతో ఈ చిత్రం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. శివ కన్నా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకంతో చేస్తున్నామని అన్నాడు. కాగా, ఈ సినిమా ప్రారంభ సన్నివేశానికి క్లాప్ కొట్టిన రాంగోపాల్ వర్మ తల్లికి కృతజ్ఞతలు చెబుతూ, ఆమె తన తల్లిని గుర్తు చేశారని చెప్పాడు.