rahul gandhi: తక్షణం రాహుల్ పట్టాభిషేకం లేదు... కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన సీడబ్ల్యూసీ
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 24
- డిసెంబర్ 8న ఎన్నికలు
- 11న ఫలితాల వెల్లడి
- రాహుల్ కు పోటీ దాదాపు లేనట్టే!
ఈ ఉదయం న్యూఢిల్లీలో సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష పదవికి రాహుల్ ఎన్నిక ఏకగ్రీవమవుతుందని, ఆయన పట్టాభిషేకం వెంటనే జరిగిపోతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్న వేళ, తదుపరి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది.
రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తామని, నామినేషన్ల దాఖలుకు ఈ నెల 24 చివరి తేదీ అని సీడబ్ల్యూసీ ప్రకటించింది. డిసెంబర్ 1 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని, డిసెంబర్ 8న కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక, 11న ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొంది. ఇక ఈ ఎన్నికల్లో రాహుల్ మినహా మరెవరైనా నామినేషన్ వేస్తారని భావించడం లేదని, ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అవుతుందని సీనియర్ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలోని ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని కొనసాగించాలని భావించిన మీదటే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినట్టు తెలిపారు.