ys jagan: కుర్చీలు ఇవ్వలేకపోయినందుకు సారీ తల్లీ!: మహిళలకు జగన్ క్షమాపణ

  • 'మహిళా గర్జనకు' పోటెత్తిన మహిళలు
  • కూర్చునేందుకు కుర్చీలు లేక అవస్థలు
  • వారిని క్షమించాలని కోరిన జగన్
  • ఉత్సాహంగా ప్రసంగించిన వైఎస్ జగన్

తన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 'మహిళా గర్జన' పేరిట నిర్వహించిన సదస్సుకు భారీగా మహిళలు తరలి రావడంతో, వారంతా కూర్చునేందుకు కుర్చీలు లేని పరిస్థితిని చూసి వైకాపా అధినేత వైఎస్ జగన్ చలించిపోయారు. "చాలామంది అక్కచెల్లెమ్మలు నిలుచునే ఉన్నారు. కుర్చీలు లేకపోయినందుకు సారీ తల్లీ. కుర్చీలు అయిపోయాయి. పూర్తిగా నిండిపోయాయి. అయినా మీరంతా నిలుచునే ఉన్నారు. మీకు సారీ అండీ" అని అన్నారు.

"ఈ రోజు ఇన్ని వేల మంది అక్కచెల్లెమ్మలు ఒకచోట ఏకమై, నాలుగు సంవత్సరాల చంద్రబాబునాయుడుగారి పరిపాలనలో ఎన్ని అవస్థలు పడతావున్నాం? ఏ రకంగా మోసపోయామని బాధపడుతూ, ఇవాళ జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావం తెల్పడానికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకు కూడా ముందుగా చేతులు జోడించి, శిరస్సు వంచి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా" అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

 టీడీపీ అధికారం చేపట్టి నాలుగేళ్లయిందని, మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా, అక్టోబర్ లోనే ముందుగా ఎన్నికలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారని గుర్తు చేశారు. ఆయన చెప్పినట్టు జరిగితే, మరో 11 నెలల్లో ఎన్నికలు వస్తాయని, ఈ సమయంలో తాను అడుగుతున్నది ఒకటేనని, ఈ పరిపాలన ఎలా సాగింది? ఏ కుటుంబానికైనా మంచి జరిగిందా? అన్నది మనస్సాక్షిని అడగాలని చెప్పారు.

అధికారంలోకి రావడం కోసం టీడీపీ ఎన్ని మాటలు చెప్పిందో గుర్తు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకపోవడం వల్లే ప్రజల జీవితాలు దారిద్ర్యంలోకి వెళ్లాయని, రాజకీయ వ్యవస్థను మార్చాల్సి వుందని అన్నారు. చెప్పింది చెయ్యకుండా మోసం చేస్తున్న రాజకీయ నాయకులకు పదవుల్లో కొనసాగే హక్కు లేదని నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News