YSRCP: పోలీస్ వాహనం నుంచి కిందపడ్డ వైకాపా నేతలు... మల్లాది విష్ణు, ఉదయభాను, పార్థసారధిలకు గాయాలు!
- చలో అసెంబ్లీలో ఉద్రిక్తత
- నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
- తరలిస్తున్న వాహనానికి షడన్ బ్రేక్ వేయగా కిందపడ్డ నేతలు
ఏపీకి ప్రత్యేక హోదాను తక్షణం ఇవ్వాలన్న డిమాండ్ తో వైకాపా, వామపక్షాలు చేపట్టిన చలో అసెంబ్లీ నిరసన యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. పలువురు వైకాపా నేతలను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని స్టేషన్ కు తరలిస్తున్న వేళ, వాహనంపై నుంచి పడిన నేతలకు గాయాలయ్యాయి. పోలీసు వాహనానికి సడన్ బ్రేకు వేయడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వైకాపా నేతలు పార్థసారధి, మల్లాది విష్ణు, జోగి రమేష్, ఉదయభాను తదితరులకు గాయాలు అయ్యాయి.
అంతకుముందు వెల్లంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడు, సీపీఎం నేతలు మధు, బాబూరావు, సీపీఐ నేతలు రామకృష్ణ, శంకర్ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన నేతలను పోలీసులు మాచవరం స్టేషన్ కు తరలించారు. వీరందరినీ ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎక్కించారని ప్రజా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. నేతలకు తగిలిన గాయాలపై మరింత సమాచారం తెలియాల్సి వుంది.