ivanka trump: ఇవాంకా పర్యటన అంతా గోప్యమే... స్వాగతించడానికి రావద్దని సూచన!
- శంషాబాద్ కు ఇవాంకా ఎన్నింటికి రానున్నారన్నది గోప్యం
- ఆమెను ఆహ్వానించేందుకు ఎయిర్ పోర్టుకు రావద్దన్న భద్రతాధికారులు
- పర్యటనకు సంబంధించిన ఏ అంశమూ బయటకు పొక్కకుండా జాగ్రత్తలు
గ్లోబల్ సమ్మిట్ సదస్సు కోసం హైదరాబాదుకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సలహాదారు ఇవాంకా ట్రంప్ పర్యటనను అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. ఆమె అధికారిక పర్యటనకు సంబంధించిన ఏ వివరాలు బయటకు పొక్కనీయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా శంషాబాదు విమానాశ్రయంలో ఆమె అడుగుపెట్టే సమయంలో అధికారిక హోదాలో ఆమెకు స్వాగతం పలకడానికి ఎవరూ రావద్దని అమెరికా భద్రతాధికారులు సమాచారం అందించారు.
దీంతో ఆమె ఎన్ని గంటలకు హైదరాబాదులో ల్యాండ్ అవుతారు? ఎక్కడ బసచేస్తారు? ఏఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు? వంటి వివరాలన్నీ రహస్యంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గ్లోబల్ సమ్మిట్ సదస్సు చివర్లో ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమాలు పూర్తైన అనంతరం... కెనడాలో స్థిరపడ్డ హైదరాబాదీ ప్రముఖ వ్యాపార వేత్త ప్రేమ్ శ్రీవాస్తవ, అమెరికాకు చెందిన సిస్కో కంపెనీ యజమాని జాన్ చాంబర్స్ తోపాటు పది మంది పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారని తెలుస్తోంది.