ivanka trump: ఇవాంకా అడుగుపెట్టేది శంషాబాద్ లో కాదు.. బేగంపేట్ లో?
- 28న ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు ఇవాంకా
- బేగంపేట్ లో దిగనున్న ప్రధాని మోదీ
- ఇవాంకా కూడా అక్కడే దిగితే మంచిదంటున్న అధికారులు
హైదరాబాదు వేదికగా జరగనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన ప్రత్యేక సలహాదారు ఇవాంకా ట్రంప్ ఈనెల 28న రానున్న సంగతి తెలిసిందే. ఆమె షెడ్యూల్ లో చివరి నిమిషంలో మార్పులు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఆమె అమెరికా నుంచి హైదరాబాదు శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరనున్నారని మొదట్లో వార్తలు వచ్చాయి. ఈ మేరకు అమెరికా నుంచి వచ్చిన భద్రతాధికారులు సెక్యూరిటీ బాధ్యతలు తీసుకున్నారని కూడా వార్తలు వెలువడ్డాయి.
తాజాగా ఈ విషయంలో మార్పులు చోటుచేసుకున్నట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్ లోని ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానుండగా, ఇద్దరికీ వేర్వేరుగా సెక్యూరిటీ ఏర్పాటు చేయడం ఇబ్బందిగా మారుతుందని, ఈ నేపథ్యంలో ఇవాంకా విమానం కూడా బేగంపేట్ ఎయిర్ పోర్టులో దిగితే భద్రతా వ్యవహారాలు మరింత పకడ్బందీగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె భద్రత పర్యవేక్షిస్తున్న అమెరికా అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె శంషాబాద్ లో కాకుండా బేగంపేట్ లో దిగనున్నారని తెలుస్తోంది. ఇక ఆమె మాదాపూర్ లోని 'హోటల్ వెస్టిన్'లో బసచేయనున్నారు. మాదాపూర్ లోని మైండ్ స్పేస్ టెక్నోపార్క్ లో ఈ హోటల్ ఉంది. ఈ హోటల్ భద్రతను అమెరికా భద్రతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.