Nara Lokesh: లోకేష్.. ఇది నా సలహా.. తప్పయితే క్షమించండి.. ఒప్పయితే స్వీకరించండి: తమ్మారెడ్డి భరద్వాజ
- అవార్డులపై చంద్రబాబు చాలా హుందాగా వ్యవహరించారు
- లోకేష్ మాట్లాడిన తీరు బాగోలేదు
- ఇవి తెలుగు సినిమాలకు ఇస్తున్న అవార్డులు, ఆధార్ కార్డులకు కాదు
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. సినీ రంగానికి ప్రోత్సాహకాలను అందించే క్రమంలో ఇస్తున్న ఈ అవార్డులు... చివరకు కుల, రాజకీయ రంగు పులుముకున్నాయి. ఈ అవార్డులపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పలు విధాలుగా తమ స్పందనను తెలియజేశారు. తాజాగా ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ దీనిపై మరోసారి స్పందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో చాలా హుందాగా వ్యవహరించారని... అవార్డుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారని తమ్మారెడ్డి అన్నారు. తాను కూడా ఇదే అంశంపై మాట్లాడుతూ, అవార్డులను కులాలకు, మతాలకు, పార్టీలకు ఆపాదించవద్దని మొన్ననే చెప్పానని తెలిపారు. చంద్రబాబు వరకు అంతా బాగానే ఉందని... మంత్రి లోకేష్ ఈ అంశంపై స్పందించిన తీరు మాత్రం బాగోలేదని అన్నారు.
ఆంధ్రాలో ఆధార్ కార్డు లేనివారు కూడా ఈ అంశంపై విమర్శలు చేస్తున్నారంటూ లోకేష్ మాట్లాడారని... ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి అబ్బాయి ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం తనకు బాధను కలిగించిందని చెప్పారు. లోకేష్ ఏదైనా మాట్లాడేముందు ఆయన తండ్రి పరువు గురించి ఆలోచించుకోవాలని సూచించారు. మొన్నటి దాకా మీకు ఆధార్ కార్డులు ఎక్కడున్నాయి? మీరు ఇప్పటికీ హైదరాబాదులోనే ఉంటున్నారు, మీకు మాట్లాడే అర్హత ఉందా? అని తాము అడిగితే బాగోదని... చాలా అసహ్యంగా ఉంటుందని చెప్పారు. లోకేష్ చాలా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇవి తెలుగు సినిమాలకు ఇస్తున్న అవార్డులని... ఆధార్ కార్డులకు ఇస్తున్న అవార్డులు కాదని... ఆధార్ కార్డులకు ఇచ్చే అవార్డులను పెడితే, అప్పుడు ఎవరైనా మాట్లాడితే, అది తప్పని తమ్మారెడ్డి అన్నారు. అప్పుడు మీరు ఏది అన్నా ఎవరూ మాట్లాడరని చెప్పారు. అవగాహన లేకుండా మాట్లాడి మీ పరువు, మీ నాన్నగారి పరువు, రాష్ట్రం పరువు తీయవద్దని సూచించారు. చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని, ఆయనతో కలసి పని చేశానని, లోకేష్ ను చిన్నప్పటి నుంచి చూశానని... అందుకే తన మనసులోని ఆలోచనను ఓ సలహా రూపంలో లోకేష్ కు ఇస్తున్నానని చెప్పారు. తప్పు అనిపిస్తే తనను క్షమించాలని, ఒప్పైతే స్వీకరించాలని అన్నారు.