vallabhaneni vamsi: రాజీనామాకు సిద్ధపడ్డ వల్లభనేని వంశీ.. అసెంబ్లీలో కలకలం!
- సీఎం కార్యాలయ అధికారుల తీరుతో మనస్తాపం
- కంటతడి పెట్టిన వంశీ
- రాజీనామా లేఖతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే
టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా చేయనున్నారనే వార్తలు ఏపీ అసెంబ్లీ లాబీలో కలకలం రేపాయి. డెల్టా షుగర్స్ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారనే కారణంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో, ఆయన సీఎం ఆఫీసులో కన్నీటి పర్యంతం అయ్యారు. దీంతో, ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. రాజీనామా లేఖను స్పీకర్ కోడెలకు సమర్పించేందుకు ఆయన అసెంబ్లీకి వెళ్లారు. విషయం తెలుసుకున్న మరో ఎమ్మెల్యే బోడె ప్రసాద్... వల్లభనేని వంశీని ఆపి, రాజీనామా లేఖను చించేశారు. వెంటనే ఈ విషయం మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లింది. దీంతో, వంశీని బుజ్జగించే బాధ్యతను ఆయన మంత్రి కళా వెంకట్రావుకు అప్పగించారు.
హనుమాన్ జంక్షన్ లో ఉన్న డెల్టా షుగర్స్ సంస్థ గత నాలుగు నెలలుగా మూతపడింది. దీన్ని తణుకుకు మార్చాలనే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడే ఉంచాలని... ఇక్కడ నుంచి తరలిస్తే, ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతారని వంశీ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. చెరుకు రైతులతో కలసి ఆయన సీఎంను కలసి, వినతి పత్రం అందించారు. తాజగా ఈ రోజు కూడా ఈ విషయంపై చర్చించేందుకు రైతులతో కలసి సీఎం కార్యాలయానికి వంశీ వచ్చారు. అయితే, ఈ సందర్భంగా ఆయనతో సీఎం కార్యాలయ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. ముఖ్యంగా గిరిజా శంకర్ ఆయనతో సరైన రీతిలో వ్యవహరించలేదని తెలుస్తోంది. దీంతో వంశీ తీవ్ర మనస్తాపానికి లోనై, రాజీనామాకు సిద్ధపడ్డారు.