botsa satyanarayana: లోకేష్ కు అహంకారం, అధికార మదం ఎక్కువైంది: బొత్స సత్యనారాయణ
- అనర్హులకు అవార్డులు ఇచ్చారు
- టీడీపీ నేతలు పంచ భూతాలను కూడా దోచుకుంటున్నారు
- హోదా కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేదు
ఏపీ మంత్రి నారా లోకేష్ పై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. లోకేష్ కు అహంకారం ఎక్కువైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార మదంతోనే నంది అవార్డులపై మాట్లాడారని చెప్పారు. అనర్హులకు అవార్డులు ఇవ్వడంపై ప్రశ్నిస్తే... ఏపీలో ఆధార్ కార్డు గురించి అడుగుతారా? అంటూ మండిపడ్డారు. 'ఏపీలో ఆధార్ కార్డు ఉన్న వ్యక్తులను మాత్రమే నంది అవార్డుల జ్యూరీలోకి తీసుకున్నారా?' అని ప్రశ్నించారు. మంత్రి పదవిలో ఉన్న లోకేష్ బాధ్యతా రాహిత్యంతో మాట్లాడారని విమర్శించారు.
టీడీపీ నేతలు పంచ భూతాలను దోచుకు తింటున్నారని బొత్స ఆరోపించారు. భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజులు దోచుకు తింటున్నారని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే భోగాపురం ఎయిర్ పోర్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెంది ఉండేదని... చంద్రబాబు విదేశీ పర్యటనలు లేకుండానే అభివృద్ధి సాధ్యమయ్యేదని బొత్స అన్నారు. హోదా విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయలేదని... అందుకే స్పెషల్ స్టేటస్ రాలేదని తెలిపారు.